ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలి

ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలి
- జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ: కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ కార్యాలయంలో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 121 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
1) కోడుమూరు కు చెందిన వీరేష్ విద్యుత్ శాఖలో వాచ్ మెన్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ .1 లక్ష 50 వేలు తీసుకొని మోసం చేశాడని, బంగారం తాకట్టు పెట్టి డబ్బులు అప్పు తీసుకొచ్చి ఇచ్చానని ఇంతవరకు ఉద్యోగం ఇప్పించలేదు, డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని మిడుతూరు మండలం, రోళ్ళ పాడు గ్రామానికి చెందిన శివుడు ఫిర్యాదు చేశారు.
2) మంచి జీతం వచ్చే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 40 లక్షలు తీసుకొని నన్ను మోసం చేసిన ఉపేంద్ర @ శివ పై చర్యలు తీసుకోవాలని కర్నూలు, కల్లూరు మండలం, హేమలత నగర్ చెందిన ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
3) ఎల్ఐసి ఏజెంట్ అని చెప్పి, నన్ను నమ్మించి, గుర్తు తెలియని వ్యక్తి నా అకౌంట్ నుండి రెండు దఫాలుగా రూ. 95 ,990 డెబిట్ చేసి మోసం చేశాడని ఆస్పరి మండలం, కారుమంచి గ్రామానికి చెందిన గురుకరణ ఫిర్యాదు చేశారు.
4) నా పంట అమ్మగా వచ్చిన రూ. 3 లక్షలు యూనియన్ బ్యాంక్ లోని మా అల్లుడి అకౌంట్ లో ఉంచాము . అయితే ఆ బ్యాంకు అకౌంటు హ్యాక్ అయిందని సైబర్ క్రైమ్ వారిని కలవడం జరిగింది.పంజాబ్ , హర్యానా వారు హ్యాక్ చేశారని న్యాయం చేయాలని, రికవరీ చేయాలని కర్నూలు ఈ. తాండ్రపాడు గ్రామానికి చెందిన మహేంద్ర ఫిర్యాదు చేశారు.
5) నా భర్త బాలకృష్ణ నన్ను ఇంటి నుండి బయటకు గెంటివేశాడని, నాకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడని న్యాయం చేయాలని కర్నూలు, ధర్మపేటకు చెందిన రేణుక ఫిర్యాదు చేశారు.
6) నేను పసుపుల పశుసంవర్ధక శాఖలో అటెండర్ గా పనిచేస్తున్నాను. పెద్దల నుండి వచ్చిన ఆస్తి 5 సెంట్ల భూమి ఉన్నది. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. 5 సెంట్ల భూమిని పెద్ద కుమారుడే ఆక్రమించుకోవాలని చిన్న కుమారుడికి ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయించాలని ఒత్తిడికి గురి చేస్తున్నాడని పెద్ద కుమారుడి పై చర్యలు తీసుకోవాలని కర్నూల్, భూపాల్ నగర్ కు చెందిన రమణబాయి ఫిర్యాదు చేశారు.
7) పొలం విషయంలో బెదిరిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నందవరం మండలం, నాగలదిన్నె గ్రామానికి చెందిన భీమేష్ ఫిర్యాదు చేశారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటి పై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా , సిఐలు శివ శంకర్, మస్తాన్ వలి పాల్గొన్నారు.
