AP | ఎంపీ చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు

AP | ఎంపీ చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తిరువూరులోని మెప్మా కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మెప్మా ఎన్నికల నిర్వహణపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మెప్మా ఎన్నికలు జరగకుండా ఎంపీ కేశినేని చిన్ని ఎందుకు అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ఎంపీ వర్గం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఎంపీ చిన్ని ఐదుగురు సభ్యులను కిడ్నాప్ చేయించి, మరో నలుగురిని వారి ఇళ్లలో నిర్బంధించారని కొలికపూడి ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలను అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు.

అన్యాయంగా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తే సహించబోమని ఎమ్మెల్యే గట్టిగా హెచ్చరించారు. ఈ వ్యవహారం స్థానికంగా రాజకీయ వేడిని పెంచింది. విషయం తెలిసి ఎంపీ వర్గం కూడా మెప్మా కార్యాలయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.
