2029target | కేసీఆర్ రీ-ఎంట్రీతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం

2029target | కేసీఆర్ రీ-ఎంట్రీతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం

2029target | జగిత్యాల సభతో కేసీఆర్ రాజకీయ రీఎంట్రీ
రేవంత్ పాలనపై పదునైన విమర్శలు
గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
భవిష్యత్తు ప్రణాళికపై ఆసక్తి

2029target |ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో గులాబి పార్టీ ఓటమిపాలై, కాంగ్రెస్ అధికారంలోకొచ్చినప్పటి నుంచి ఇన్నాళ్లుగా భారాస పార్టీలో కొనసాగుతున్న ఒక నిశ్శబ్ధ, అనిశ్చితి వాతావరణాన్ని ఛేదిస్తూ, గులాబీ దళపతి కేసీఆర్ నేడు అంటే ఏప్రిల్ 20, 2026న జగిత్యాల బహిరంగ సభ ద్వారా తిరిగి ప్రజల మధ్యకు వస్తున్నారు. శాసనసభ ఎన్నికల తర్వాత దాదాపు ఫామ్ హౌజ్‌కే పరిమితమై పోయారన్న విమర్శలు, పార్టీ మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్న వేళ.. కేసీఆర్ చేస్తున్న ఈ రీ-ఎంట్రీ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. కేవలం ఒక నాయకుడి చేరిక కోసమే ఆయన వస్తున్నారా అంటే.. రాజకీయంగా దీని వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం.

2029target
2029target

జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతల చేరిక అనేది ఒక నామమాత్రపు నెపమే కావచ్చు. కానీ కేసీఆర్ అసలు లక్ష్యం మాత్రం ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేయడం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో గత కొన్నాళ్లుగా ముదురుతున్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరును కేసీఆర్ తనదైన శైలిలో ఎండగట్టే అవకాశం ఉంది. వాటన్నిటి ఫలితంగా తెలంగాణలో పాలన అసమర్థంగా తయారైందని గట్టిగా వినిపించవచ్చు. ఒక పార్టీగా కాంగ్రెస్ బలహీనపడితేనే, ప్రభుత్వం బలహీనపడవచ్చు. అలా జరిగితేనే తాము తిరిగి పుంజుకోగలమన్న స్పష్టమైన వ్యూహంతోనే ఆయన జగిత్యాల వేదికను ఎంచుకున్నారు. రేవంత్ రెడ్డి పాలనపై తన పదునైన విమర్శలతో ప్రజలను ఆలోచింపజేయడమే కేసీఆర్ ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది.

ప్రస్తుత రేవంత్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నెరవేరని హామీలు, ముఖ్యంగా రైతాంగ ఇబ్బందులుపై కేసీఆర్ తన గళాన్ని విప్పబోతున్నారు. “ఇన్నాళ్లూ పాలన ఎలా ఉంది? మేం ఉన్నప్పుడు ఎలా ఉండేది?” అనే పోలికను ప్రజల మెదళ్ళలోకి బలంగా పంపడం ద్వారా, ప్రభుత్వ వ్యతిరేకతను ఒడిసిపట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు. పాలనలో అనుభవం లేకపోవడం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం తడబడుతోందన్న విమర్శను కేసీఆర్ ఈ సభలో ప్రధానాస్త్రంగా వాడబోతున్నారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను ఎండగట్టడం ద్వారా తన రాజకీయ అస్తిత్వాన్ని తిరిగి చాటుకోవాలని చూస్తున్నారు.

నిజానికి గత కొంతకాలంగా కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉండటం వల్ల గులాబీ శ్రేణుల్లో ఒక రకమైన స్తబ్దత ఆవరించింది. పార్టీని వదిలి నేతలు వెళ్తున్నా, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నిరాశకు గురవుతున్నా.. అధినేత మౌనం వహించడంపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అయితే నేటి జగిత్యాల సభ ఆ స్తబ్దతను వీడగొడుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కేసీఆర్ ఒకసారి గళం విప్పితే కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం రావడం ఖాయమని గులాబీ నేతలు నమ్ముతున్నారు. నాయకుడు మైదానంలోకి వస్తేనే క్యాడర్ లో కదలిక వస్తుంది అన్న సత్యం ఇప్పుడు బీఆర్ఎస్ కు అర్థమైనట్లు కనిపిస్తోంది.

అయితే, ఈ రీ-ఎంట్రీ కేవలం విమర్శలకే పరిమితమవుతుందా లేక భవిష్యత్తు కోసం ఏదైనా బలమైన ప్రణాళికను కేసీఆర్ బయటపెడతారా అన్నది ఆసక్తికరం. అధికారాన్ని కోల్పోయిన తర్వాత తొలిసారిగా భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్నందున, ఆయన మాటల్లో పదును పెరగడం ఖాయం. కాంగ్రెస్ లోని ‘అంతర్గత కుమ్ములాటలే ఆ పార్టీకి శాపం‘ అని కేసీఆర్ చెప్పడం ద్వారా, అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టడం ఈ సభ వెనుక ఉన్న ప్రధాన ఎత్తుగడ. ఇది కేవలం ఒక బహిరంగ సభ మాత్రమే కాదు, వచ్చే అసెంబ్లీ యుద్ధానికి పునాదిగా కూడా చూడవచ్చు.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు ప్రజల మధ్యకు రావడం అనేది ఎప్పుడూ ఆహ్వానించదగ్గ పరిణామంే. పాలకుల తప్పులను ఎండగట్టడానికి, ప్రజల పక్షాన నిలబడడానికి కేసీఆర్ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు తిరిగి రంగంలోకి దిగడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త పోకడలకు దారితీస్తుంది. జగిత్యాల గడ్డపై నుంచి ఆయన చేసే విమర్శలు రేవంత్ రెడ్డి సర్కార్ ను ఎంతవరకు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి, గులాబీ పార్టీకి ఎంతటి ఊపిరిని పోస్తాయి అన్నది వేచి చూడాల్సిందే.

Leave a Reply