Deputy CM | త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రముఖులు
Deputy CM | త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రముఖులు
Deputy CM | ఆంధ్రప్రభ వెబెడెస్క్ : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు శనివారం సాయంత్రం (ఏప్రిల్ 18) హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్, శుక్రవారం ఉదయం అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వ్యక్తిగత వైద్యుల సలహాతో ఆసుపత్రిలో చేరగా, వైద్యులు ఎం.ఆర్.ఐ స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించి, శనివారం శస్త్రచికిత్స చేశారు. వైద్యులు ఆయనకు కనీసం 10 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు నేతలు, అభిమానులు ఆకాంక్షించారు. అలాగే పవన్ కల్యాణ్ త్వరగా కోలుకుని, మళ్లీ ప్రజల్లోకి రావాలని జనసేన కార్యకర్తలు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.
పవన్‌కు ప్రధాని మోదీ ఫోన్..
పవన్ కల్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఏపీ సీఎం చంద్రబాబు: “పవన్ కల్యాణ్ గారు శస్త్రచికిత్స తర్వాత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన త్వరగా శక్తిని పుంజుకుని, పూర్వపు ఆరోగ్యంతో ప్రజా సేవలో పాల్గొనాలి” అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
నారా లోకేష్: “పవన్ అన్నా.. డాక్టర్ల సలహా మేరకు తగినంత విశ్రాంతి తీసుకోండి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఆశగా పనిచేసే మీరు త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్, కేటీఆర్: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
