అతిథి గృహ నిర్మాణాలకు శంకుస్థాపన

అతిథి గృహ నిర్మాణాలకు శంకుస్థాపన
వేద మంత్రోచ్ఛరణలు, శాస్త్రోక్త పూజల నడుమ భూమి పూజ చేసిన సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
క్రతువులో భాగస్వామ్య మైన హైకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ రవి చీమలపాటి
విశాఖపట్టణం. ఆంధ్రప్రభ : విశాఖపట్టణంలోని ఎండాడ పరిధిలో ఐదెకరాల స్థలంలో నిర్మించతలపెట్టిన హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహ నిర్మాణాలకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శనివారం శంకుస్థాపన చేశారు. వేద మంత్రోచ్ఛరణలు, శాస్త్రోక్త పూజల నడుమ సహచర న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ రవి చీమలపాటిలతో కలిసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం మీట నొక్కి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
సహచర న్యాయమూర్తులతో పాటు గునపం పట్టుకొని, సిమెంట్ వేసి నిర్మాణాలకు అంకురార్పణ చేశారు. ఇతర పూజా క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భూమిపూజ చేసిన ప్రాంతం నుంచి సాగర తీరాన్ని వీక్షించారు. కొండపై భాగం నుంచి కనిపించే పరిసరాలను పరిశీలించారు. నిర్మాణ ప్రక్రియలు, ఇతర అంశాలకు సంబంధించిన ప్రాథమిక వివరాలను కోర్టు, జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సన్యాసినాయుడు, ఫస్ట్ ఏడీజే వెంకటరమణ, జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, ఇతర న్యాయమూర్తులు, కోర్టు అధికారులు, వివిధ విభాగాల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తులకు ఆత్మీయ సత్కారం…
శంకుస్థాపన క్రతువు అనంతరం కొండ దిగువ భాగంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు హైకోర్టు న్యాయమూర్తులు చేరుకున్నారు. జిల్లా కోర్టులో పని చేసే న్యాయమూర్తులు, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇతర అధికారులతో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, అధికారులతో వారు బృంద చిత్రాలు దిగారు.
ఈ క్రమంలో ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను జిల్లా కోర్టు న్యాయమూర్తులు, అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆత్మీయంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
