చిలకలడోణ ఘటనలో విషాదం

చిలకలడోణ ఘటనలో విషాదం
కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో బాలిక మృతి.
9 కి చేరిన మృతుల సంఖ్య
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : మంత్రాలయం సమీపంలో గురువారం చోటుచేసుకున్న చిలకలడోణ రోడ్డు ప్రమాదం మరో ప్రాణాన్ని బలిగొంది. ఇప్పటికే ఎనిమిది మంది మృతిచెందిన ఈ ఘోర ఘటనలో, చికిత్స పొందుతున్న మరో బాలిక మరణించడంతో మృతుల సంఖ్య 9కు చేరింది.
మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం దర్శనానికి వస్తున్న కర్ణాటకలోని చిక్మంగళూరు చెందిన 22 మంది భక్తులు బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు అక్కడ నుంచి బయలుదేరారు. జాతీయ రహదారి 167 మీదుగా ప్రయాణిస్తున్న బొలెరో గూడ్స్ వాహనం గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని ఢీకొట్టింది. రెండు వాహనాలు ఢీకొన్న తీవ్రతకు కర్ణాటక కు చెందిన వాహనం పూర్తిగా ధ్వంసం అయింది.ప్రమాద తీవ్రతకు వాహనంలో ప్రయాణిస్తున్న వారు చెల్లాచెదురుగా రోడ్డు మీద పడ్డారు.
ఘటనాస్థలంలోనే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. గాఢ నిద్రలో ఉన్న కర్ణాటక వాహన డ్రైవర్ సునీల్ వాహనాన్ని ఎడమవై నుంచి కుడివైపుకు తిప్పడంతో ఈ ప్రమాదం కు కారణంగా పోలీసులు గుర్తించారు. ఇక ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వారిలో తేజశ్విని (15) అనే బాలిక పరిస్థితి విషమంగా మారింది. వైద్యులు శ్రమించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. శుక్రవారం ఉదయం ఆమె మృతి చెందడంతో ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 9కు పెరిగింది. ఈ ఘటనలో మృతులంతా కర్ణాటకకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన బంధువులే కావడం మరింత హృదయ విదారకంగా మారింది. ఒకే వాహనంలో భక్తి భావంతో బయలుదేరిన వారు, గమ్యానికి చేరుకునే క్షణాల్లోనే మృత్యువుకు బలి కావడం అందరినీ కలచివేస్తోంది.
ఘటనలో డ్రైవర్ సునీల్, ఆయన తండ్రి సుశీల్ కుమార్, సుశీల్ కుమార్ తమ్ముడు భార్య లో లక్ష్మి, ఆయన కుమార్తె నిక్షిత, అత్త జయమ్మ ఇప్పటికే మృతి చెందారు.. ప్రస్తుతం తేజస్విని మృతి చెందడంతో.. ఆయా కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రస్తుతం ఆసుపత్రిలో మనోజ్, సుబ్బమ్మ, అమృత, దీక్షిత, తంగి వర్షిత, జయమ్మ, ధన్య శ్రీ, దీపక్, ప్రతాప్, నవీన్, సంచన, సుమ, భారతీయులు ఉన్నారు. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తేల్చారు. మొత్తంగా మరో 10 నిమిషాల్లో మంత్రాలయం చేరుకొని తమ ఇష్ట దైవమైన రాఘవేంద్ర స్వామిని స్మరించుకుంటామని భావించిన ఈ కుటుంబంలో విషాదం నెలకొనడం గమనార్హం.
ప్రమాదంపై విశ్లేషణ ..
ఈ ప్రమాదం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఒకే వాహనంలో అధిక సంఖ్యలో ప్రయాణించడం, తెల్లవారుజామున డ్రైవింగ్, రహదారి పరిస్థితులు వంటి అంశాలు ప్రమాదానికి కారణాలుగా భావిస్తున్నారు. ముఖ్యంగా సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణికులను తరలించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.
అలాగే మంత్రాలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రత చర్యలు మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబాల్లో శోకసంద్రం ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందడంతో వారి స్వగ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది. ఆసుపత్రి వద్ద బంధువుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. “దేవుడి దర్శనం కోసం వెళ్లి ఇలా తిరిగి వస్తారని ఊహించలేదు” అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ముగింపు దైవ దర్శనం కోసం ప్రారంభమైన ఆ యాత్ర… క్షణాల్లోనే విషాదంగా మారింది. చిలకలడోణ ప్రమాదం కేవలం ఒక రోడ్డు ప్రమాదం మాత్రమే కాదు… నిర్లక్ష్యం, భద్రతా లోపాలపై హెచ్చరికగా నిలిచింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రహదారి భద్రతపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
