నాడు అడిషనల్ ఎస్పీగా.. నేడు డీజీపీగా..

నాడు అడిషనల్ ఎస్పీగా.. నేడు డీజీపీగా..

  • బెల్లంపల్లి ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌తో డీజీపీ శివధర్ రెడ్డికి ప్రత్యేక అనుబంధం
  • నేడు కన్నెపల్లి పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర పోలీస్ బాస్, డీజీపీ బి.శివధర్ రెడ్డి పర్యటన బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకప్పుడు ఇక్కడ అడిషనల్ ఎస్పీగా సేవలందించిన ఆయన, నేడు డీజీపీ హోదాలో తాను పని చేసిన ప్రాంతానికి రావడం విశేషం. బెల్లంపల్లి ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌తో ప్రస్తుత డీజీపీ బి. శివధర్ రెడ్డికి విడదీయలేని అనుబంధం ఉంది. 1998 నుంచి 2000 మధ్యకాలంలో ఆయన ఇక్కడ అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఉత్తర తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలను అణచివేయడంలో ఈ కేంద్రం వ్యూహాత్మకంగా పని చేసింది. సుమారు రెండు దశాబ్దాల తర్వాత, రాష్ట్ర పోలీస్ విభాగానికి అధిపతిగా అదే ప్రాంతానికి రానుండటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కన్నెపల్లిలో నూతన ఠాణా ప్రారంభం:
తమ పర్యటనలో భాగంగా డీజీపీ బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి పోలీస్ స్టేషన్‌ను నూతనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పోలీస్ శాఖ ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పర్యవేక్షణలో, మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పర్యటన సాఫీగా సాగేలా స్థానిక పోలీస్ అధికారులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply