vaibhav| నాకు బాదుడు ఒక్కటే తెలుసు

vaibhav| నాకు బాదుడు ఒక్కటే తెలుసు
బంతినే చూస్తా.. బౌలర్‌ను కాదు..
ప్రపంచ స్థాయి బౌలర్లనే వణికిస్తున్న వైభవ్
15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో విధ్వంసం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : నేను బంతిని మాత్రమే చూస్తా.. బౌలర్ ఎవరనేది చూడను.. ఇదీ వైభవ్ సూర్యవంశీ డైలాగ్. బరిలో దిగానంటే నాకు బాదడమే తెలుసు.. ఇంకేం తెలియదంటున్నాడు వైభవ్. బుమ్రా అయినా.. హేజిల్‌వుడ్ అయినా నాకు ఎవరైనా ఒకటే.. ఎవరినీ లెక్క చేయనంటున్నాడు చిచ్చరపిడుగు. తన గురి అంత బంతి మీదే.. నాకింకేం కనిపించదంటున్నాడు విధ్వంసకారుడు.
చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. బరిలో దిగడమే ఆలస్యం పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నాడు. బంతి పడటమే లేట్.. దానిని స్టాండ్‌లోకి పంపించడానికి సిద్ధమవుతున్నాడు. బౌలర్ ఎవరనేది చూడకుండా సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. హేమాహేమాలైన బౌలర్లకు కూడా చెమటలు పట్టిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లనే భయపెడుతున్న ఈ కుర్రాడిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. బుమ్రా, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, బౌల్ట్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లను కూడా ఉతికారేస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో నాలుగు మ్యాచులలో 50 సగటుతో 200 పరుగులు సాధించాడీ కుర్ర క్రికెటర్. 266.67 అత్యధిక స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్‌ను అధిగమించి ఆరెంజ్ క్యాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. జైస్వాల్ 183 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మొత్తం 18 సిక్సర్లు బాదాడు. అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

శుక్రవారం రాత్రి గువాహటి వేదికగా జరిగిన మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ సత్తాను మరోసారి చాటాడు. క్రీజులో ఉన్నంత సేపు ఆర్‌సీబీ బౌలర్లను వీడియో గేమ్ ఆడాడు. వరల్డ్ బెస్ట్ పేసర్లు అయిన జోష్ హజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్‌లను ఆడుతున్నాననే బెరుకు లేకుండా విరుచుకుపడ్డాడు. వైభవ్ సిక్సర్లు కొడుతుంటే సీనియర్ ప్లేయర్ విరాట్‌కోహ్లీ కళ్లప్పగించి చూడటమే తప్పా ఏమీ చేయలేకపోయాడు. వైభవ్ సునామీ ఇన్నింగ్స్ ఆడటంతో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. 26 బంతుల్లో 78 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఓడిపోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు తొలి పరాజయాన్ని రుచి చూపించాడు.

వైభవ్ గురించి అతని కోచ్ మనీష్ ఓజా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. నిన్న జరిగిన మ్యాచులో గేల్ రికార్డు మిస్ అవ్వడంపై స్పందిస్తూ.. “ఇప్పుడే తొందరపడకండి, కాస్త వెయిట్ చేయండి. ఆ సమయం త్వరలోనే వస్తుంది, అది కూడా ఈ ఐపీఎల్ 2026 సీజన్ లోనే చూస్తారు” అని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్ రాయల్స్ ఏ మ్యాచ్ లో అయినా సరే మొదట బ్యాటింగ్ చేస్తే, వైభవ్ విధ్వంసం మరో లెవల్ లో ఉంటుందని, క్రిస్ గేల్ సాధించిన అత్యున్నత స్కోరు 175 రన్స్ రికార్డును కూడా అతను బ్రేక్ చేస్తాడని కోచ్ జోస్యం చెప్పారు.
