నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది

నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది
- రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్
- ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ
గోదావరిఖని, ఆంధ్రప్రభ ; నిరుపేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా నిలుస్తోందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. మంగళవారం గోదావరిఖని పట్టణంలోని 54 డివిజన్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి చేపట్టిన భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే మక్కాన్సింగ్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య పాల్గొన్నారు. భూమి పూజ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలన్నదే తమ ప్రధాన లక్షణం అన్నారు.
దానిలో భాగంగానే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో ఇల్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్… అదేవిధంగా ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చేందుకు కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నామని పేర్కొన్నారు.
రామగుండం నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తాను పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే దిశగా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్సింగ్ వివరించారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు.
గతంలో ఎప్పుడూ లేనివిధంగా నియోజకవర్గం లో వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని వివరించారు. నియోజకవర్గంలోని ఎవరికి ఏ కష్టం వచ్చినా, తనను స్వయంగా కలవచ్చునని మీ సమస్య పరిష్కారానికి తాను ముందు ఉంటానని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ చెప్పారు. డివిజన్ కార్పొరేటర్ ముస్తఫా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కాల్వ లింగస్వామి, దూళికట్ట సతీష్, కొక్కిరాల శ్రీనివాస్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
