ఎల్లంపేట మున్సిపాలిటీలో సమస్యలపై క్షేత్రస్థాయి పర్యటన

మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో డబిల్పూర్ పట్టణంలోని పలు వార్డుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మంగళవారం సంయుక్తంగా పర్యటించారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడమే ఈ పర్యటన లక్ష్యంగా సాగింది.
ఈ కార్యక్రమంలో ఎల్లంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడ్య శ్రీదేవి, వైస్ చైర్‌పర్సన్ రజిత దేవేందర్ రెడ్డి, కమిషనర్ స్వామి నాయక్, మేనేజర్ అబ్దుల్ సలాం, ఏఈ దుర్గాప్రసాద్, సంబంధిత వార్డు కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
పర్యటనలో భాగంగా పలు వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను గుర్తించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడ్య శ్రీదేవి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడం తమ బాధ్యత అని తెలిపారు. గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు నిధులు, కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పారు. అలాగే మున్సిపల్ అధికారులు ప్రజల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు.
