ఘనంగా బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకలు

మక్తల్ , ఆంధ్రప్రభ ; భారతదేశానికి అపూర్వమైన సేవలు అందించిన మహానేత, బాబు జగ్జీవన్ రామ్ అని అని రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని నారాయణపేట క్రాస్ రోడ్డు లో బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని పీడిత వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన బాబు జగ్జీవన్ రామ్ భారత రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడని మంత్రి అన్నారు.

ఆయన చూపించిన మార్గం సమానత్వం, సామాజిక న్యాయం అవకాశాల సమాన పంపిణీకి దారితీసిందని తెలిపారు. దేశ నిర్మాణంలో, వ్యవసాయం, కార్మిక రంగాల అభివృద్ధిలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ హక్కులు కల్పించడంలో బాబు జగ్జీవన్ రామ్ పాత్ర ఎంతో గొప్పదని మంత్రి శ్రీహరి అభిప్రాయపడ్డారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం సాధనలో కట్టుబడి పనిచేస్తోందని మంత్రి వెల్లడించారు.

ఈ సందర్భంగా యువత ఆయన జీవితం నుంచి ప్రేరణ పొందుతూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని మంత్రి ఆకాంక్షించారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మున్సిపల్ ఛైర్ పర్సన్ వాకిటి మానస హన్మంతు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాధా లక్ష్మా రెడ్డి, మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవి, మండల అధ్యక్షుడు గణేష్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ లు మహేష్, వెంకటేష్, నాయకులు కావలి తాయప్ప ,నీలాగౌడ్, జి.నీలప్ప, చెన్నయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply