చిత్తూరు జిల్లాలో గ్యాస్ సమస్య లేదు

చిత్తూరు జిల్లాలో గ్యాస్ సమస్య లేదు
ఆందోళన అవసరం లేదు
సందేహాల కోసం కంట్రోల్ రూమ్
జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గృహ వినియోగ సిలిండర్ల సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంయుక్త కలెక్టర్ ఏ. రాజేంద్రన్ తెలిపారు. గ్యాస్ సరఫరాపై ఏవైనా సందేహాలు ఉంటే కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08572-242734ను సంప్రదించాలని సూచించారు. ఈ కంట్రోల్ రూమ్ ప్రతి పని దినం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని వెల్లడించారు.
జిల్లాలో గ్యాస్ సరఫరా వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రతి మండల తహశీల్దారుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించామని తెలిపారు. మండలంలోని గ్యాస్ ఏజెన్సీలను ప్రతిరోజూ తనిఖీ చేసి స్టాక్, బుకింగ్ వివరాలను పరిశీలిస్తూ ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తున్నామని చెప్పారు.
గుడిపాల మండలంలోని శ్రీ కీర్తన గ్యాస్ ఏజెన్సీపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపించి, నిర్వహకునికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే ఆయిల్ కంపెనీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
గ్యాస్ సరఫరాపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్‌లో ఇప్పటివరకు 50 కాల్స్ అందాయని, వాటిలో 46 సమస్యలను ఏజెన్సీలతో మాట్లాడి పరిష్కరించామని తెలిపారు.
వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే కమర్షియల్ సిలిండర్ల సరఫరా కూడా అవసరాన్ని బట్టి 70 శాతం వరకు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ఇండస్ట్రియల్ కాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డైరీలు, అన్న కాంటీన్లు, పౌల్ట్రీ, సిరి కల్చర్ పరిశ్రమలకు ఈ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు.
అయితే గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు 23 మందిపై 6 కేసులు నమోదు చేసి 49 సిలిండర్లను స్వాధీనం చేసుకుని కోర్టులో సమర్పించినట్లు చెప్పారు.
జిల్లాలో గ్యాస్ నిల్వలు తగిన విధంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని, ప్రతి ఏజెన్సీ వద్ద తహశీల్దార్‌ను పర్యవేక్షణ కోసం నియమించామని తెలిపారు. ప్రజలు అవసరం లేకుండా తొందరపడి రీఫిల్లింగ్ బుకింగ్ చేయవద్దని, వదంతులను నమ్మవద్దని సూచించారు.
వినియోగదారులు గ్యాస్ బిల్లులో ఉన్న ధర మాత్రమే చెల్లించాలని, అదనపు రుసుములు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్యాస్ ఏజెన్సీ యజమానులు వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సకాలంలో సిలిండర్లను సరఫరా చేయాలని సంయుక్త కలెక్టర్ ఆదేశించారు.
