ఎన్టీఆర్ వైద్య సేవలు బ్రేక్..

ఎన్టీఆర్ వైద్య సేవలు బ్రేక్..

  • ప్రభుత్వానికి ప్రైవేట్ ఆసుపత్రుల షాక్
  • బకాయిల భారం తట్టుకోలేక సేవలకు బ్రేక్
  • కొత్త రోగుల చేరిక నిలిపివేత
  • అత్యవసర కేసులకు మాత్రమే చికిత్స
  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో వందకు పైగా ఆసుపత్రుల ప్రభావం

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో పేదలకు ఆధారంగా ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవలకు ప్రైవేట్ ఆసుపత్రులు అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వైద్య రంగంలో కలకలం రేపింది. ప్రభుత్వం నుంచి భారీగా బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) పిలుపు మేరకు నేటి నుంచి నెట్‌వర్క్ ఆసుపత్రులు కొత్తగా రోగులను చేర్చుకోవడం నిలిపివేశాయి. ఆసుపత్రుల వర్గాల ప్రకారం, వందల కోట్ల రూపాయల బకాయిలు నెలలుగా చెల్లింపులు లేకపోవడంతో నిర్వహణలో తీవ్ర ఆర్థిక ఒత్తిడి నెలకొంది. ఔషధాలు, సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు భరించలేని స్థితికి చేరుకున్నామని, ఈ పరిస్థితుల్లో సేవలు కొనసాగించడం సాధ్యం కాదని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ నిర్ణయం ప్రభావం ఉమ్మడి కృష్ణా జిల్లాలో తీవ్రంగా కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వందకు పైగా నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోవడంతో పేద, మధ్యతరగతి రోగులు ప్రత్యామ్నాయాల కోసం ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా అత్యవసరేతర చికిత్సలు, శస్త్రచికిత్సలు వాయిదాపడే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి అంతరాయం కలగకుండా సేవలు కొనసాగుతాయని ఆసుపత్రులు వెల్లడించాయి. అత్యవసర కేసులకు మాత్రం వైద్యం అందిస్తామని, కానీ కొత్తగా సాధారణ కేసులను చేర్చుకోవడం లేదని స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా పరిస్థితిని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అత్యవసరంగా సమీక్షిస్తున్నారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనపు సదుపాయాలు కల్పించడం, ప్రత్యామ్నాయ చికిత్స మార్గాలను ఏర్పాటు చేయడం వంటి చర్యల పై దృష్టి సారించారు. ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రుల మధ్య చర్చలు జరిపి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని నిపుణులు సూచిస్తున్నారు. బకాయిల చెల్లింపు పై స్పష్టత రాకపోతే సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశముందని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Leave a Reply