వాటర్ ట్యాంక్ ఎక్కి తెలంగాణ ఉద్యమకారుల నిరసన

గోదావరిఖని, ఆంధ్రప్రభ ; పెద్దపెల్లి జిల్లా రామగుండం ఎన్టీవీ సి వద్ద తెలంగాణ ఉద్యమకారులు సోమవారం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని ఉద్యమం చేసిన ఉద్యమకారుల పట్ల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని ఎండగాడుతూ ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్, విజయకుమార్, మల్లేష్ లు ఎన్టిపిసి శాలపల్లె రోడ్ లోనీ వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన చేపట్టారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్ తోపాటు 250 గజాల స్థలాన్ని మంజూరు చేస్తానని ఇప్పటివరకు అమలు చేయకపోవడంపై ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు బస్సు పాసులు కూడా ఇస్తానని చెప్పి ఇవ్వడం లేదన్నారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు మళ్లీ ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. సుమారు గంటసేపు వాటర్ ట్యాంక్ పైనే తమ నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల జోక్యంతో ట్యాంక్ దిగిన వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ఎన్టీపిసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Leave a Reply