ఘనంగా మట్టల ఆదివారం

ఘనంగా మట్టల ఆదివారం

  • పెద్దసంఖ్యలో పాల్గొన్న క్రైస్తవులు
  • మిన్నంటిన ‘హోసన్న’ నినాదాలు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని కల్వరి మినిస్ట్రీస్ చర్చిలో మట్టల ఆదివారం (పామ్ సండే) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈస్టర్ పండుగకు ముందు వచ్చే ఈ పవిత్ర ఆదివారాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు పెద్ద సంఖ్యలో చర్చికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ‘హోసన్న.. హోసన్న’ నినాదాలతో చర్చి ప్రాంగణం మార్మోగింది. ప్రత్యేక ప్రార్థనల్లో క్రైస్తవులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

చర్చి పాస్టర్ ప్రవీణ్ ప్రార్థనలు నిర్వహించి, మట్టల ఆదివారం విశిష్టతను వివరించారు. సుమారు రెండు వేల ఏళ్ల క్రితం యేసుక్రీస్తు గాడిదపై ఎక్కి యెరూషలేము పట్టణంలోకి విజయ ప్రవేశం చేసిన సందర్భంగా ప్రజలు తమ వస్త్రాలు, మట్టలను దారిపొడవునా పరచి ‘జయము.. జయము’ అంటూ స్వాగతం పలికారని తెలిపారు. ఇది శాంతి, వినయం, విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు.

లోక రక్షకుడైన యేసుక్రీస్తు మానవాళి పాప విముక్తి కోసం తనను తాను తగ్గించుకుని శాంతి దూతగా అవతరించారని వివరించారు. ఈ పవిత్ర వారంలో క్రైస్తవులంతా భక్తిశ్రద్ధలతో ప్రార్థనల్లో పాల్గొని, క్రీస్తు చూపిన ప్రేమ, కరుణ, సమానత్వ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. చివరగా పాస్టర్ ప్రవీణ్ హాజరైన క్రైస్తవులకు ఆశీర్వచనాలు అందజేశారు. వేలాదిగా క్రైస్తవులు హాజరుకావడంతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది.

Leave a Reply