రోడ్డు భద్రతపై ప్రత్యేక ప్రదర్శన

రోడ్డు భద్రతపై ప్రత్యేక ప్రదర్శన
హైవే ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎస్డీపీవో బాబు ప్రసాద్ ఆదేశాల మేరకు గురువారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో హైవే మొబైల్ సిబ్బందికి రోడ్డు ప్రమాదాల సమయంలో అనుసరించాల్సిన చర్యలపై వివరణాత్మకంగా అవగాహన కల్పించారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను ప్రారంభించడం, గాయపడిన వారిని ‘గోల్డెన్ అవర్’లో ఆసుపత్రులకు తరలించడం అత్యంత కీలకమని సూచించారు.
అలాగే రోడ్డు భద్రత వాహనాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన పరికరాలను ప్రదర్శించారు. ప్రమాద స్థలంలో వాహనం వెనుక 150 అడుగుల దూరంలో, సమీపంలో, ముందు భాగంలో హెచ్చరిక కోన్లు అమర్చడం, 100 అడుగుల దూరం వరకు టేపరింగ్ విధానంలో ఏర్పాటు చేయడం, తగిన దూరంలో కోన్ల మధ్య విరామం పాటించడం వంటి అంశాలను వివరించారు.

అదేవిధంగా సిబ్బంది తప్పనిసరిగా రేడియం జాకెట్లు ధరించడం, బ్యాటన్లు వినియోగించడం, వాహనాల్లో హాజర్డ్ లైట్లు ఆన్ చేయడం వంటి భద్రతా చర్యలను పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో వేగవంతమైన స్పందనతో ప్రాణాలను రక్షించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా హైవే మొబైల్ సిబ్బందికి ప్రాయోగిక అవగాహన కల్పించామని తెలిపారు.



