ఆ స్కానింగ్ సెంటర్‌ను వెంటనే సీజ్ చేయాలి..

ఆ స్కానింగ్ సెంటర్‌ను వెంటనే సీజ్ చేయాలి..

  • మైనర్ జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టిన..
  • వేద స్కానింగ్ సెంటర్‌ను తక్షణం సీజ్ చేయాలి..
  • బాధ్యుల‌ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..

నర్సంపేట క్రైం, ఆంధ్రప్రభ : దుగ్గొండి మండలానికి చెందిన ఒక మేజర్ గ్రామ పంచాయతీలో నివసిస్తున్న 17 సంవత్సరాల మైనర్ యువతికి సంబంధించి నర్సంపేటలోని ఒక ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌లో జరిగిన సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఆ యువతికి కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను నర్సంపేటలోని ఒక ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా, అక్కడి వైద్యుల సూచన మేరకు వేద స్కానింగ్ సెంటర్‌లో పరీక్షలు చేయించారు. అక్కడి డాక్టర్ గర్భం ఉందని తప్పుడు నివేదిక ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నివేదికతో కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు.

అనంతరం, మరింత స్పష్టత కోసం వరంగల్‌లోని మరో స్కానింగ్ సెంటర్‌లో పరీక్షలు చేయించగా, ఆ యువతికి గర్భం లేదని నిర్ధారణ కావడంతో మొదటి నివేదిక తప్పు అని తేలింది. ఈ సంఘటన వల్ల యువతి, ఆమె కుటుంబం తీవ్రంగా బాధపడటంతో పాటు సామాజికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తప్పుడు నిర్ధారణ వల్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సంబంధిత స్కానింగ్ సెంటర్, డాక్టర్‌ పై పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆరోగ్య శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని.. వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సూపర్డెంట్ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దండు రాజు, గోళ్లేన వంశీ, కత్తి చెందు, గిన్నె భాస్కర్, ప్రశాంతి, సంధ్య, మౌనిక, సూరమ్మ, సుమలత పాల్గొన్నారు.