చిత్తూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు రికార్డులు సీజ్

చిత్తూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు రికార్డులు సీజ్
ఏసీబీ కానిస్టేబుల్ పై డాక్యుమెంట్ రైటర్ల దాడి
ఇద్దరి మీద పోలీసు కేసు నమోదు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక దాడులు, అనంతరం ఏసీబీ సిబ్బందిపై జరిగిన దాడి ఘటన జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనల పరంపరలో ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించిన పలు రికార్డులను ఏసీ అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. అలాగే అదనంగా ఉన్న 95 వేల రూపాయల్లో నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అవకతవకల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించనన్నారు.
అదనపు ఎస్పీ విమల కుమారి వివరాల ప్రకారం, రిజిస్ట్రార్ కార్యాలయంపై అందిన ఫిర్యాదుల ఆధారంగా సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో పలు కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నామని, వాటిని పరిశీలించి పూర్తి నివేదికను సిద్ధం చేసి సంబంధిత అధికారులకు అందజేస్తామని పేర్కొన్నారు. అలాగే తనిఖీల సమయంలో రూ.95,000 నగదు అదనంగా ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో తనిఖీల సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలో ఏసీబీ కానిస్టేబుళ్ల విధులకు ఆటంకం కలిగించి, వారిపై దాడి చేసినందుకు ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లపై చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
పోలీసుల వివరాల మేరకు, ఈ కేసులో ఇద్దరు నిందితులు ఉన్నారు. వారు సనంగి రామకృష్ణ , సనంగి సతీష్ సోదరులు. మార్చి 23వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలోని ఎస్‌ఆర్‌కే అసోసియేట్స్ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది..ఆకస్మిక తనిఖీలు జరుగుతున్న సమయంలో ఒక అనుమానితుడు కార్యాలయం నుండి బయటకు పరుగెత్తడంతో, అతన్ని వెంబడించిన ఏసీబీ కానిస్టేబుళ్లు ధనుంజయ్, లీల ప్రసాద్‌లు ఎస్‌ఆర్‌కే అసోసియేట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ డాక్యుమెంట్ రైటర్ గురించి విచారణ చేయగా, సనంగి రామకృష్ణ వాగ్వాదానికి దిగుతూ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు..అతను కానిస్టేబుల్ షర్ట్ కాలర్ పట్టుకుని లోపలికి లాగి బయటకు తోసి, భుజాలు, తలపై దాడి చేశాడని తెలిపారు.
ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న సనంగి సతీష్ కూడా కానిస్టేబుల్‌పై దాడి చేసి, మెడ పట్టుకుని నేలకేసి తోసి, ఇనుప రాడ్‌తో దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ప్రాణహాని బెదిరింపులకు పాల్పడ్డాడని వెల్లడించారు. తర్వాత అక్కడికి చేరుకున్న మరో కానిస్టేబుల్ లీల ప్రసాద్ తన ఐడీ కార్డు చూపించినప్పటికీ, నిందితులు దానిని లాక్కొని వంచి పడేసినట్లు సమాచారం.
అనంతరం ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడి నుండి వెళ్లేందుకు ప్రయత్నించగా, నిందితులు అడ్డుకుని మళ్లీ దాడి చేసి, బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఏసీబీ ఇన్స్పెక్టర్ ఎస్.వి. నరసింహరావు ఫిర్యాదు మేరకు చిత్తూరు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అవినీతి ఆరోపణలపై దాడులు జరగడం, అదే సమయంలో అధికారులపై దాడి జరగడం వంటి సంఘటనలు తీవ్రంగా పరిగణించబడతాయని, నిందితులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
