పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి…

పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి…
సూర్యాంధ్ర ప్రగతి రథాల ద్వారా ప్రచారం కల్పించాలి
తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామోహన్
పటమట, ఆంధ్రప్రభ : సౌరశక్తి వినియోగంపై ప్రజలల్లో అవగాహన పెంపొందిస్తూ ప్రతి ఇంట్లో సూర్యఘర్ వెలుగులు నింపేందుకు పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహనకు సూర్యాంధ్ర ప్రగతి రథాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈఎఫ్ఐ), నెడ్ క్యాప్ సంయుక్త ఆధ్వర్యంలో సూర్యాంధ్ర ప్రగతి రథాలను విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మంగళవారం అశోక్ నగర్ లోని తన క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేకమైన కార్యక్రమం ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ అని, ప్రతి ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే అతి తక్కువ ఖర్చుతో మనం ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉందన్నారు. మనకు అయ్యే ఖర్చు సుమారు 4 నుండి 6 ఏళ్లలో కరెంట్ బిల్లుల ఆదా ద్వారా తిరిగి వచ్చేస్తుందన్నారు. అనంతరం 20 ఏళ్ల పాటు మనం ఉచితంగా విద్యుత్ పొందే అవకాశం ఉంటుందన్నారు.
ఈ రోజున ఏ ఇంటికి వెళ్లినా కరెంట్ బిల్లు ప్రధానమైన భారంగా మారుతోందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలుకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయన్నారు. ప్రకృతి నుంచి, సూర్యుడి నుంచి శక్తిని గ్రహించి సోలార్ ప్లేట్ల ద్వారా ఎనర్జీని ఇచ్చే గొప్ప కార్యక్రమం ఇది అని అన్నారు. దీనివల్ల కాలుష్యం కూడా ఉండదన్నారు. విద్యుత్ ప్లాంట్ల వల్ల బొగ్గు పొగ వల్ల వచ్చే కాలుష్యం మన ఊపిరితిత్తులపై ఎంత ప్రభావం చూపుతుందో మనం ఆలోచించుకోవాలన్నారు.
ఈ పథకంలో క్రింద ప్రభుత్వం పలు సబ్సిడీలను అందిస్తోందన్నారు. రూ.70 వేల నుండి రూ.80 వేల వరకు ఖర్చయ్యే ప్లాంట్‌పై రూ.30,000 సబ్సిడీ ఉంటుందన్నారు. షెడ్యూల్ కులాలు తెగల వర్గాలకు నూరు శాతం సబ్సిడీ ఇస్తున్నారన్నారు. వారికి ఒక్క పైసా ఖర్చు లేకుండా ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉందన్నారు. బీసీలతో పాటు అందరికీ ఇందులో సబ్సిడీలు వర్తిస్తాయన్నారు.
వ్యక్తిగతంగా లబ్ది పొందా…ప్రజా ప్రతినిధిగా నా అనుభవం…
తన వ్యక్తిగత అనుభవానికి వస్తె తనకు గతంలో నెలకు వేల రూపాయల విద్యుత్ బిల్లు చెల్లించేవాడినని, సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నాక ఇప్పుడు రూ.4,000 నుండి రూ.5,000 వరకు బిల్లు తగ్గిందన్నారు. ఇందుకు సుమారు రూ.6 లక్షలు వరకు ఖర్చు చేశానన్నారు. దీనివల్ల నెలకు రూ.18,000 చొప్పున ఏడాదికి లక్షకు పైగా ఆదా అవుతోందన్నారు. ఇలా మూడు నుండి నాలుగు సంవత్సరాలలో నేను పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేస్తుందన్నారు.
తాను వ్యక్తిగతంగా లబ్ధి పొందాను కాబట్టి, ఒక శాసనసభ్యునిగా, ప్రజా ప్రతినిధిగా అందరూ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఎన్ఎస్ఈఎఫ్ఐ సీఈవో సుబ్రహ్మణ్యం పులిపాక మాట్లాడుతూ… సూర్యాంధ్ర ప్రచార ప్రగతి రథాల ద్వారా పీఎం సూర్యఘర్ పథకం ప్రయోజనాలు, దరఖాస్తు విధానం, సబ్సిడీ వివరాలను ప్రజలకు తెలియజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి సీహెచ్ ఉదయ్, నెడ్ కాప్ డెవలప్మెంట్ ఆఫీసర్ మౌలాలి పాల్గొన్నారు.
