కోమటి కుంటలో రియల్ ఎస్టేట్ దందా

వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : మండలంలోని ఇల్లంద గ్రామంలో కోమటి కుంటలను లక్ష్యంగా చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం దందాగా మారిందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ కుంటలను ప్లాట్లుగా మార్చి లేఅవుట్లు చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని వారు చెబుతున్నారు.

సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కోమటి కుంటతో పాటు, ఇల్లంద గ్రామంలో గొలుసుకట్టు విధానంలో నిర్మించిన దాదాపు 15 కుంటలు ఉన్నాయి. వర్షాధార పంటలను దృష్టిలో ఉంచుకుని కాకతీయ రాజులు ఈ గొలుసుకట్టు కుంటలను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. వర్షపు నీరు ఒక కుంట నుంచి మరొక కుంటకు చేరుతూ చివరకు ఊర చెరువులో కలిసే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

ఇలాంటి కుంటలను గత ప్రభుత్వాల కాలంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేశారు. అయితే ఇప్పుడు అదే కుంటలను చదును చేసి ప్లాట్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒక కుంటను చదును చేస్తే మిగతా కుంటలను కూడా విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామంలో మరికొందరు పట్టాదారులపై ఆరోపణలు ఉన్నాయి. ఇలా కుంటలను నాశనం చేస్తే భూగర్భ జలాలు తగ్గిపోవడంతో పాటు వ్యవసాయం దెబ్బతిని, భూములు బీడుగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి.. జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని ఈ పనులను నిలిపివేయాలని గ్రామ ప్రజలు, రైతులు కోరుతున్నారు.