శాస్త్రవేత్త, విశ్రాంత ఉద్యోగి కొడవల్ల వెంకయ్య ఇకలేరు
శాస్త్రవేత్త, విశ్రాంత ఉద్యోగి కొడవల్ల వెంకయ్య ఇకలేరు
- అనారోగ్యంతో నిన్న హైదరాబాద్ లో మృతి
- స్వగ్రామం ఎన్టీఆర్ జిల్లా మూలపాడు
- జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శాస్త్రవేత్తగా పేరు
- 2007 నుంచి 2014 వరకు సీపీసీఎస్ఈఏలో కేంద్ర కమిటీ సభ్యత్వం
- నేటి సాయంత్రం మూలపాడులో అంత్యక్రియలు
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : పశు పోషణ, శరీర శాస్త్రం రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్త, విశ్రాంత ఉద్యోగి కొడవల్ల వెంకయ్య (68) శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లో మృతి చెందారు. కొద్దికాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు ఈయన స్వగ్రామం. ముఖ్యంగా పశువుల ఆహారం, జీర్ణక్రియ, పోషక విలువలపై వెంకయ్య పరిశోధనలు చేశారు.
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యానియల్ న్యూట్రిషన్ అండ్ ఫిజియోలజీ (ఎన్ఐఏఎన్ పీ) విభాగాధిపతిగా పనిచేసిన ఆయన పరిశోధన ప్రాజెక్టులను పర్యవేక్షించడంతోపాటు శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించారు. పశువుల పోషణలో కొత్త సాంకేతికతలు అభివృద్ధి, రైతులకు ఉపయోగపడే పరిష్కారం మార్గాలు అందించారు. పశువులకు సరైన ఆహారం నియంత్రణ, పాల ఉత్పత్తి పెంచే పోషక విధానాలు, జీర్ణక్రియ మెరుగుపరిచే ఆహార పదార్థాలు, పర్యావరణానికి హానికరం కానీ పశుపోషణ విధానాలపై ఆయన పరిశోధనలు చేశారు.
వెంకయ్య తన రంగంలో చేసిన పరిశోధనల వల్ల జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన శాస్త్రవేత్తగా పేరుపొందారు. 2007 నుంచి 2014 వరకు కమిటీ ఫర్ ది ప్రపోజ్ ఆఫ్ కంట్రోల్ అండ్ సూపర్ విజన్ ఆఫ్ ఎక్స్ పెరిమెంట్ ఆన్ యానిమల్స్ (సీపీసీఎస్ఈఏ)లో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. వెంకయ్య మృతితో స్వగ్రామం మూలపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి ఆదివారం ఉదయం మూలపాడు తీసుకొచ్చారు. పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. సాయంత్రం హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
