కనుమరుగవుతున్న ప్రకృతి సంపద..
కనుమరుగవుతున్న ప్రకృతి సంపద..
- గుట్టలను తోడేస్తున్న జేసీబీలు
- మట్టిని తరలిస్తున్న టిప్పర్లు
- పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు,
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని శాంతినగర్, నవాబుపేట, శివారులోని గుట్టలు, నాడు దట్టమైన పచ్చని అడవితో పక్షుల కిలకిలలు, జంతువుల అరుపులతో, ప్రకృతి అందాలు, విలువైన సంపదలతో, ఆహ్లాదకరమైన వాతావరణం తో అటుగా వెళ్లే ప్రజలకు కనువిందు చేసేది.
దీంతో గత రెండు దశాబ్దాల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. దీంతో ఆ భూములను తక్కువ ధరకే వందల ఎకరాల భూములు కొనుగోలు చేసి, విలువైన ఖనిజ సంపద ఐరన్ ఓవర్ తరలించి కాసుల వర్షం కురిపించుకున్నారు.

కాగా మరికొందరు గత పది సంవత్సరాల క్రితం పట్టా భూముల పేరుతో నవాబుపేట శివారులోని గుట్టలను కొనుగోలు చేశారు. దీంతో గుట్టలను భారీ యంత్రాలు జెసిబిల సహాయంతో గుట్టల్లో ఎర్ర మట్టిని తోడేస్తున్నారు. దీంతో ఆ మట్టిని గ్రీన్ ఫీల్డ్ కారిడార్ హైవే రోడ్డుకు ఎర్ర మట్టిని అమ్ముకొని రూ లక్షలాది కాసుల వర్షం కురిపించుకుంటున్నారు.
ప్రకృతి సిద్ధమైన గుట్టలు, అడవులు, ఎర్రమట్టి ,ఐరన్ ఓవర్, తరలిస్తూ, ప్రకృతి సంపద కనుమరుగు చేస్తున్నారు. భవిష్యత్ తరాల్లో ప్రకృతి సంపద కనుమరుగు కావడంతో పర్యావరణానికి పెను ప్రమాదం పొంచి ఉందని, ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రభుత్వం, తగు చర్యలు తీసుకొని, ప్రకృతి సంపదను, గుట్టలను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
