పల్లె నుంచి ప్రపంచానికి…

పల్లె నుంచి ప్రపంచానికి…

  • కంటి వెలుగులు పంచుతున్న తెలుగు సేవామూర్తి
  • అట్లాంటాలో తెలంగాణ వాసి సేవలకు అంతర్జాతీయ గౌరవం
  • న్యూజెర్సీలో బాలకిష్ట రెడ్డికి ఘన సత్కారం

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలం, దిండిచింతపల్లి గ్రామానికి చెందిన బాలకిష్ట రెడ్డి ఇందుర్తి అమెరికాలో ప్రముఖ సామాజిక సేవకుడిగా గుర్తింపు పొందుతూ, మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు అందుకున్నారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, టెక్సాస్‌లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసిన బాలకిష్ట రెడ్డి ఇందుర్తి 1992లో అట్లాంటాలో స్థిరపడి, 2004 నుంచి భారతీయ సమాజానికి విశేష సేవలు అందిస్తున్నారు.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామ), ఆప్నా ఫౌండేషన్ మరియు శంకర నేత్రాలయ యు.ఎస్.ఎ సంస్థలకు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ సేవా కార్యక్రమాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి నిధుల సేకరణలో ఆయన చేసిన కృషికి గాను “శంకర రత్న” పురస్కారం అందుకోవడం విశేషం.

2016లో శంకర నేత్రాలయ సంస్థలో ట్రస్టీగా చేరిన ఆయన, 2018లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థను 7 నుంచి 29 శాఖలకు విస్తరించడంలో ముందుండారు. 2025లో ఆయన ఆధ్వర్యంలో సుమారు 2 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించడం ఆయన సేవా తపనకు నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు “మొబైల్ ఐ సర్జికల్ యూనిట్” (మెసు) కార్యక్రమాన్ని ప్రారంభించి, హైదరాబాద్, పుట్టపర్తి, ఎట్టయపురం ప్రాంతాల్లో మూడు యూనిట్లను ఏర్పాటు చేయించడం ద్వారా వేలాది మందికి చూపు వెలుగులు నింపుతున్నారు.

ఇటీవల న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ పట్టణంలో ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు ఘనంగా సత్కరించాయి. తెలంగాణ ప్రభుత్వంలో ప్రముఖ అధికారి గణపతి రెడ్డి తమ్ముళ్లలో చిన్నవారైన బాలకిష్ట రెడ్డి ఇందుర్తి తన విజయాలకు కుటుంబ సభ్యులు, సహచరులు, వాలంటీర్ల సహకారమే ప్రధాన కారణమని వినమ్రంగా తెలిపారు. గ్రామీణ నేల నుంచి గ్లోబల్ స్థాయికి ఎదిగి, సేవతో సమాజానికి వెలుగునిస్తున్న బాలకిష్ట రెడ్డి ఇందుర్తి నిజంగా యువతకు స్ఫూర్తి ప్రతీకగా నిలుస్తున్నారు. తెలంగాణ గర్వకారణంగా నిలిచిన ఈ సేవామూర్తికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply