జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలు ప్రారంభం..

జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలు ప్రారంభం..

క్రీడాకారులకు సువర్ణావకాశం
శాప్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎంపికలు
ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి 24న విజయవాడలో ట్రయల్స్
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్ క్రీడాకారులకు శుభవార్త అందింది. జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎంపికల ద్వారా రాష్ట్రస్థాయి పోటీలకు అర్హులైన ప్రతిభావంతుల్ని గుర్తించి పంపించేందుకు క్రీడా శాఖ చర్యలు ప్రారంభించింది. పాల్గొనదలచిన క్రీడాకారులు తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా నమోదు ప్రక్రియ పూర్తి చేసిన వారికే ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

అథ్లెటిక్స్ విభాగంలో 100, 400, 800 మీటర్ల పరుగులు, 1500 మీటర్ల రేస్, లాంగ్ జంప్, షాట్‌పుట్, డిస్కస్ త్రో, హైజంప్, జావెలిన్ త్రో, 4×100 మీటర్ల రిలే వంటి పలు విభాగాల్లో ఎంపికలు నిర్వహించనున్నారు. మార్చి 24న ఉదయం 9 గంటలకు విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరుకావాలని సూచించారు. ఈ ఎంపికల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈ నెల 30, 31 తేదీల్లో యూనివర్సిటీ వేదికలపై జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక కానున్నారు. జిల్లాలోని యువ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవాలని క్రీడా అధికారులు కోరుతున్నారు. క్రమశిక్షణతో, పట్టుదలతో పాల్గొని రాష్ట్రస్థాయికి ఎదగాలని సూచిస్తున్నారు.

Leave a Reply