srh | కావ్య పాప‌పై ఫ్యాన్స్ ఫైర్‌

srh | కావ్య పాప‌పై ఫ్యాన్స్ ఫైర్‌

పాక్ ఆట‌గాడిని ఎలా కొనుగోలు చేస్తావ‌ని విమ‌ర్శ‌లు
సన్‌రైజర్స్‌ను బ్యాన్‌ చేయాలంటూ భారీ ట్రోలింగ్‌
అబ్రార్‌ ఎంపిక జరిగిన కొన్ని గంటలకే సన్‌రైజర్స్‌ లీడ్స్‌ అధికారిక ఎక్స్‌ ఖాతా సస్పెండ్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సన్‌రైజర్స్ లీడ్స్ ద్వారా జరిగిన ఈ కొనుగోలు కారణంగా కొంతమంది అభిమానులు ‘బాయ్‌కాట్ SRH’ అంటూ ప్రచారం ప్రారంభించారు. ఈ జట్టు ఐపీఎల్‌లోని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యమైన సన్ గ్రూప్‌కు చెందినది. వేలంలో అబ్రార్ అహ్మద్‌ను సుమారు రూ.2.34 కోట్లుకి కొనుగోలు చేశారు. దీంతో ఎస్ఆర్ హెచ్ పై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

అబ్రార్‌ను జట్టులోకి ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సన్‌రైజర్స్ ప్రధాన కోచ్‌ డానియల్‌ వెట్టోరి వివర‌ణ ఇచ్చాడు. ‘వేలంలో మేం మొదట్లో ఆదిల్ రషీద్‌ను సొంతం చేసుకోలేకపోయాం. ఈ పరిణామం తర్వాత, ఒక విదేశీ స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించుకొన్నాం. మేం అనుకున్న నలుగురైదుగురిలో అబ్రార్‌ మెరుగైన స్పిన్నర్‌ అని భావించాం. అందుకే అతడిని తీసుకున్నాం’ అని వెట్టోరి అన్నాడు. పాక్ ఆటగాళ్లపై వస్తున్న ఊహాగానాల గురించి మాకు తెలుసు. కానీ, వారిని తీసుకోకూడదని మాకు ప్రత్యేక ఆదేశాలేవీ లేవు. మా జట్టుకు ప్రభావవంతమైన స్పిన్నర్ అవసరం కాబట్టే అబ్రార్‌ను ఎంచుకున్నాం” అని స్పష్టతనిచ్చాడు.

2009లో ఐపీఎల్‌‌ నుంచి పాక్ క్రికెటర్లను నిషేధం విధించినప్పటి నుంచి ఓ పాక్ క్రికెటర్‌తో భారత్‌కు చెందిన ఫ్రాంచైజీ ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. అబ్రార్‌ను ‘సన్‌రైజర్స్’ కొనుగోలు చేయడంపై భారత అభిమానులు మండిపడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అబ్రార్ భారత్‌‌ను అవమానించాలే పోస్టు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. కావ్య మారన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అబ్రార్‌ ఎంపిక జరిగిన కొన్ని గంటలకే సన్‌రైజర్స్‌ లీడ్స్‌ అధికారిక ఎక్స్‌ ఖాతా సస్పెండ్‌ అయ్యింది. అబ్రార్‌ను కొనుగోలు చేసిన వార్త బయటికి రాగానే భారత క్రికెట్‌ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా కావ్యా మారన్‌, సన్‌రైజర్స్‌ లీడ్స్‌పై విరుచుకుపడ్డారు. పాక్‌ ఆటగాడిని ఎలా కొనుగోలు చేస్తారంటూ అసభ్యపదజాలాలతో దుమ్మెత్తిపోశారు. సన్‌రైజర్స్‌ను బ్యాన్‌ చేయాలంటూ పిలుపునిచ్చారు. భారీ ట్రోలింగ్‌ నేపథ్యంలో ఎక్స్‌ సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఖాతాను సస్పెండ్‌ చేసింది

Leave a Reply