పదో వార్డులోని వైనాల వీధిలో సమస్యల వెల్లువ

పదో వార్డులోని వైనాల వీధిలో సమస్యల వెల్లువ

  • ముళ్ళ చెట్లు, చెత్తాచెదారంతో
  • మురుగునీరు చేరి దుర్వాసన
  • పాములు, తేళ్ల వల్ల కాలనీవాసులు భయాందోళన

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం పదో వార్డు పరిధిలోని వైనాల వీధిలో ముళ్ళ చెట్లు, చెత్తాచెదారంతో, గుంతలలో మురుగునీరు చేరి దుర్వాసనలతో, పాములు, తెళ్ళ సంచారంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరకాల పురపాలక సంఘం 10వ వార్డులోని ప్రభుత్వ ఆసుపత్రి వెనకాల గల ప్రాంతాలలో నీరు చేరి చెత్తాచెదారంతో నిండిపోవడంతో స్థానిక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు.

ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న వైనాల వీధి ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధిలో ప్రస్తుతం చెత్త కుప్పలతో నిండిపోవడంతో తీవ్ర అసౌకర్య పరిస్థితులు నెలకొన్నాయని కాలనీవాసులు చెబుతున్నారు. రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో చెత్త, గుంతలల్లో మురుగునీరు పేరుకుపోవడంతో దుర్వానన వెదజల్లుతూ పరిసర ప్రాంతాలను కలుషితం చేస్తోంది. ఈ పరిస్థితుల వల్ల అక్కడ నివసించే ప్రజలు రోజూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చెత్త ఎక్కువగా పేరుకుపోవడంతో పందులు, కుక్కలు తిరుగుతుండటం సాధారణమైందని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా చీకటి సమయంలో పాములు, తేళ్లు కూడా సంచరిస్తుండటంతో కాలనీవాసులు భయాందోళనలకు గురవుతున్నామని, చిన్నపిల్లలు బయటకు వెళ్లడానికే భయపడుతున్నారని వారు తెలిపారు. స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.

సమస్యలను పరిష్కరించాలని పదేపదే కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతం కావడంతో ప్రత్యేకంగా శుభ్రతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు . చెత్తను తరచుగా తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు. భవిష్యత్తులో చెత్త, చెదారం పేరుకుపోకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పరిసర ప్రాంతాల్లో శుభ్రతను కాపాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఈ సమస్యలపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు ఆశిస్తున్నారు.

Leave a Reply