రాజకీయ రణరంగంలో ‘మహిళా మణులు’

రాజకీయ రణరంగంలో ‘మహిళా మణులు’
- రిజర్వేషన్లతో ఉన్నత పదవులు..!
- గ్రామ, మండల, మున్సిపాలిటీ ప్రధమ పౌరులుగా మహిళలే..
- ఇంటి బాధ్యతలతో పాటు…పాలనలో తమదైన శైలిలో రాణిస్తున్న మహిళలు
మోత్కూర్, ఆంధ్రప్రభ : ఆడది అంటే అబల కాదు..సబల..! వంటింటి కుందేలు కాదు..విహంగం లా అంతరిక్షంలో సైతం మహిళలు ముందజలో ఉన్నారంటే… మహిళా శక్తి ఎంత గొప్పదో ..ప్రపంచమంతటా నేడు మహిళలు చాటుతున్న ధైర్యసాహసాలే వాటికి నిదర్శనం.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోత్కూర్ మేజర్ గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ తో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రధమ పౌరులుగా.. రాజకీయ రణరంగంలో ఉన్నత పదవులు అలంకరిస్తున్న మహిళల పాత్ర అద్వితీయం.
ఉమ్మడి మోత్కూర్ మండలంలో 1995 లో పట్టేటి సోమలక్ష్మి (ఎంపీపీ) , 2005 లో ఫైళ్ల పుష్పలత సోమిరెడ్డి (ఎంపీపీ,కాంగ్రెస్),2014 లో ఓర్సు లక్ష్మి పురుషోత్తం (ఎంపీపీ,బి ఆర్ ఎస్),వైస్ ఎంపీపీ గా వంగాల లలిత (కాంగ్రెస్) కొనసాగారు.2019 లో దీటి సంధ్యారాణి సందీప్ (ఎంపీపీ,కాంగ్రెస్),బుషిపాక లక్ష్మి మారయ్య (వైస్ ఎంపీపీ,బి ఆర్ ఎస్ ) గా, ఎంపీపీ సంధ్యారాణి పై అవిశ్వాసం తో రచ్చ కల్పన లక్ష్మినర్సింహ రెడ్డి (ఎంపీపీ,బి ఆర్ ఎస్) గా 2 దశాబ్దాల పాటు మండల స్థాయిలో మహిళలు ఉన్నత పదవిలో కొనసాగారు.
ఉమ్మడి మోత్కూర్ మండలంలో చిప్పలపల్లి కమలమ్మ (జడ్పీటీసీ)గా,2014 లో చింతల వరలక్ష్మీ (జడ్పీటీసీ, కాంగ్రెస్), 2019 లో గోరుపల్లి శారదా సంతోష్ రెడ్డి (జడ్పీటీసీ,బి ఆర్ ఎస్ )లు దశాబ్దన్నర కాలం పాటు మండలంలో ఉన్నత పదవులు పొందారు. మోత్కూర్ గ్రామపంచాయతీ 6 దశాబ్దాల చరిత్రలో మహిళలకు రిజర్వేషన్లు కల్పనతో మోత్కూర్ మేజర్ గ్రామపంచాయతీ ఏకైక తొలి, చివరి మహిళా సర్పంచ్ గా 2001 లో కల్వల కృష్ణవేణి తిర్మల్ రావ్ (బి ఆర్ ఎస్) పని చేశారు.
2018 ఆగస్టు లో మోత్కూర్ నూతన మున్సిపాలిటీ గా ఆవిర్భవించడంతో …2020 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళకు కేటాయించడంతో మోత్కూర్ తొలి మున్సిపల్ చైర్మన్ గా తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి (బి ఆర్ ఎస్) 4 ఏండ్లు కొనసాగగా, అవిశ్వాసం తో గుర్రం కవిత లక్ష్మి నర్సింహారెడ్డి (కాంగ్రెస్) మున్సిపల్ చైర్మన్ గా మరో ఏడాదిపాటు కొనసాగారు.
తొలి మున్సిపల్ పాలకవర్గంలో పోలినేని ఆనందమ్మ , ఎం డి శాహీన్ సుల్తాన లు ఇరువురు 5 ఏండ్ల పాటు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులుగా కొనసాగారు.2026 మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ కాస్త ఎస్సి మహిళకు రిజర్వ్ కావడంతో 6 వ వార్డ్ కౌన్సిలర్ గా గెలుపొందిన గడ్డం స్వప్న సోమనర్సయ్య ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్నారు.ఈ దఫా కో ఆప్షన్ పదవుల్లో సైతం ఇద్దరు మహిళలు కొనసాగే అవకాశం ఉంది.
మార్కెట్ చైర్మన్ లుగా…
నామినేటెడ్ పోస్టులైన వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో సైతం మాజీ సీఎం కేసీఆర్ రిజర్వేషన్లు కల్పించడంతో 2021 లో మోత్కూర్ మార్కెట్ చైర్మన్ గా వనం స్వాతి(ఆత్మకూరు ఎం) పనిచేశారు. 2024 లో మార్కెట్ చైర్మన్ గా నూనెముంతల విమల (గుండాల) నియామకం కాగా ప్రస్తుతం ఆమె చైర్మన్ గా కొనసాగుతున్నారు.
మున్సిపల్ కౌన్సిల్ లో మహిళలదే పై చేయి…
ప్రభుత్వం మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించగా, మొత్తం 12 స్థానాలకు గాను గత మున్సిపల్ ఎన్నికల్లో 7 గురు మహిళలు,ఈ దఫా సైతం 7 గురు మహిళలు కౌన్సిలర్లు గా గెలిచి మహిళా ఆధిపత్యం కొనసాగిస్తున్నారు.
