సమస్యల వలయం.. బస్సు నిలయం..

సమస్యల వలయం.. బస్సు నిలయం..

  • ప్రభుత్వాలు మారిన… బస్టాండ్ సమస్యలు మారడం లేదు..
  • మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తం

మద్దూర్, ఆంధ్రప్రభ : మద్దూర్ మున్సిపాలిటీలో ఆర్టీసీ బస్టాండ్ సమస్యలకు చిరునామాగా మారింది. కాలం దొర్లిపోతుంది.. ప్రభుత్వాలు.. పాలకులు మారినా తీరని మద్దూర్ అర్టీసీ బస్టాండ్ సమస్యలు. బస్టాండ్‌లో మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేక దుర్వాసనతో ప్రయాణికులు ముక్కు మూసకుంటున్నారు. వర్షాకాలంలో నీరు పోవడానికి దారి లేక బస్టాండ్‌ ఆవరణలోనే నిలిచి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో గతంలో అధికారులు గ్రావెల్‌తో గుంతలు పూడ్పించారు. బస్టాండ్‌ ఆవరణలో సీసీ నిర్మాణం లేక పోవడంతో ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

బస్టాండ్ లో కనీసం తాగునీరు లేక చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరకు దుకాణంలో రూ.20 వెచ్చించి వాటర్‌ బాటిల్‌ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాన రహదారి ప్రక్కన డ్రైనేజీ నిర్మాణం కోసం బస్టాండ్‌ నుంచి బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ద్వారం సైతం మూసుకుపోవడంతో ప్రయాణికులు, బస్సు లు ఒకే మార్గం ద్వారా లోపలికి రావాల్సి వస్తున్నది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం మరమ్మతు పనులను పూర్తిచేయక పోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Leave a Reply