యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు భూమి పూజ

మునుగోడు, ఆంధ్రప్రభ : మునుగోడు పట్టణంలోని దుబ్బ కాలువ రోడ్డులో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, టీజీఈడబ్ల్యుఐడీసీ ఎండీ గణపతి రెడ్డితో కలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో 79 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలల్లో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేయనున్నారని చెప్పారు.

మునుగోడులో నిర్మించనున్న ఈ పాఠశాల 2,500 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా రూపుదిద్దుకుంటుందని వివరించారు. కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి చదివే వాతావరణాన్ని ఈ పాఠశాలలు కల్పిస్తాయని పేర్కొన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చిందని, ఈ పాఠశాలలు పూర్తయ్యాక తెలంగాణను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటాయని అన్నారు.

నియోజకవర్గంలో ప్రస్తుతం 330 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ సుమారు 9,700 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారని పేర్కొంటూ, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, విద్యా రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Leave a Reply