తొలగించిన ప్రిన్సిపాల్‌ను తిరిగి నియమించొద్దు

తొలగించిన ప్రిన్సిపాల్‌ను తిరిగి నియమించొద్దు

  • మైనార్టీ నాయకుల డిమాండ్

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన సుఫియా నాజ్ నిర్లక్ష్యం కారణంగా 15 రోజుల క్రితం ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటనపై మైనార్టీ శాఖ రాష్ట్ర కార్యదర్శి ఆమెను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అయితే, రాజకీయ అండదండలతో ఆమె మళ్లీ ప్రిన్సిపాల్‌గా చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవద్దని కోరుతూ జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారికి వినతిపత్రం సమర్పించినట్లు మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు అప్రోజ్ ఖాన్, నాయకులు షేక్ హైదర్, అబ్దుల్ తెలిపారు.

విధుల నుంచి తొలగించిన ప్రిన్సిపాల్‌ను తిరిగి నియమించవద్దని, పాఠశాలలో రెగ్యులర్ ప్రిన్సిపాల్‌తో పాటు రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలని వినతిపత్రంలో కోరినట్లు పేర్కొన్నారు. ఆమె నిర్లక్ష్య వైఖరి కారణంగా విద్యార్థిని మృతి చెందడమే కాకుండా, గత ఐదు నెలల వ్యవధిలో సుమారు 70 మంది విద్యార్థులు పాఠశాల నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం అర్హులైన ప్రిన్సిపాల్‌ను నియమించాల్సి ఉండగా, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడం సరికాదని పేర్కొన్నారు. మైనార్టీ పెద్దలతో కలిసి తీర్మానం చేసి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. జిల్లా మైనార్టీ అధికారిని కలిసి వినతిపత్రం ఇవ్వగా, ఆయన సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినట్లు నాయకులు వెల్లడించారు.

Leave a Reply