Imprisonment | దుర్మార్గుడు దొరికాడు ఇలా ….

Imprisonment | దుర్మార్గుడు దొరికాడు ఇలా ….
ఆదోని రెండవ అదనపు జిల్లా జడ్జి పి.జె. సుధా తీర్పు
దర్యాప్తు అధికారులను అభినందించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్
Imprisonment | కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభః గోనెగండ్ల మండలంలో నమోదైన హత్య కేసులో ముద్దాయి దేవదాసుకు జీవిత ఖైదు విధిస్తూ ఆదోని రెండవ అదనపు జిల్లా జడ్జి పి.జె. సుధా తీర్పు వెలువరించారు. గోనెగండ్ల మండలం బి. అగ్రహారం గ్రామానికి చెందిన హరిజన హంద్రీ దేవదాసు, గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన హరిజన లక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. కొంతకాలానికి ఆమెపై అనుమానం పెంచుకున్న ముద్దాయి అప్పుడప్పుడు గొడవలు పెట్టేవాడు.
2021 జూన్ 6న బంధువుల పెళ్లికి వెళ్లిన లక్ష్మి ఇంటికి తిరిగి రాకపోవడంతో, జూన్ 13న మృతురాలి తల్లి కిష్టమ్మ గోనెగండ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు క్రైమ్ నం.184/2021గా మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కేసును 302 ఐపీసీగా మార్పు చేశారు.
అప్పటి ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ సిఐ మంజునాథ్ కేసు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ముద్దాయిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, లక్ష్మిని గుంతకల్లు చర్చికి తీసుకెళ్తానని తన మోటార్ సైకిల్‌పై తీసుకెళ్లినట్టు వెల్లడించాడు. కసాపురం సమీపంలోని పొలాల్లో ఆమెతో గొడవపడి గొంతు నులిమి హత్య చేసి, తన వద్ద ఉన్న బైక్ పెట్రోల్‌తో శవాన్ని దహనం చేసినట్లు, అనంతరం ఆమె ధరించిన బంగారు, వెండి ఆభరణాలను తీసుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు.
దర్యాప్తు సమయంలో పోలీసులు కసాపురం సమీపంలోని ఘటనాస్థలానికి చేరుకుని మృతురాలి పుర్రెతో పాటు ఇతర ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని డిఎన్ఎ పరీక్షలకు పంపగా, అవి మృతురాలివేనని నిర్ధారణ అయింది. అదేవిధంగా ముద్దాయి, మృతురాలి ఫోన్ కాల్ డేటాను విశ్లేషించి సాంకేతిక ఆధారాలు సేకరించారు.
అన్ని ఆధారాలను సమగ్రంగా కోర్టుకు సమర్పించడంతో పాటు, ముద్దాయిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసును విచారించిన ఆదోని రెండవ అదనపు జిల్లా జడ్జి పి.జె. సుధా ముద్దాయి నేరం రుజువైనందున జీవిత ఖైదు విధించారు. ఈ కేసులో పక్కాగా దర్యాప్తు నిర్వహించిన అప్పటి సిఐ మంజునాథ్ ప్రస్తుతం కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కేసు నమోదు నుంచి తీర్పు వరకు కృషి చేసిన దర్యాప్తు అధికారులు, కోర్టు కానిస్టేబుల్ సిబ్బంది, సాక్షులను సమన్వయం చేసిన పోలీసు బృందాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.
