Mangapet | పుష్కర్ ఘాట్ స్థల పరిశీలన..

Mangapet | మంగపేట, ఆంధ్రప్రభ : 2027వ సంవత్సరంలో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఇరిగేషన్ అధికారులు శనివారం మంగపేట మండల కేంద్రంలో గోదావరి తీరంలో ఉన్న పుష్కర్ ఘాట్ ను పరిశీలించారు. గతంలో 2015 సంవత్సరంలో గోదావరి పుష్కరాల సందర్భంగా నిర్మించిన పుష్కర్ ఘాట్ పుష్కరాల అనంతరం వచ్చిన గోదావరి వరదల వలన కోతకు గురై కొట్టుకుపోయింది. అప్పటి పుష్కర్ ఘాట్ ప్రాంతం ప్రస్తుతం గోదావరిలో భాగమైంది.
దీంతో మంగపేటలో మళ్ళీ పుష్కర్ ఘాట్ నిర్మాణం చేపట్టడం కోసం అనువైన స్థలం కోసం ఇరిగేషన్, రెవిన్యూ, పంచాయతీ అధికారులు శనివారం మంగపేట గోదావరి తీరం వద్ద స్థల పరిశీలన చేశారు. ఘాట్‌కు వెళ్లే రహదారిని పరిశీలించడంతో పాటు ఘాట్ నుంచి గోదావరిలోకి వెళ్లి స్నానం చేయడానికి ఏర్పాటు చేయాల్సిన మెట్ల నిర్మాణం కోసం, పుష్కరాలకు వచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడం కోసం స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ ఈ సిహెచ్ శంకరయ్య, డి ఈఈ ఆర్.రవికుమార్, ఏఈ వలీమ్ మహమ్మద్, మంగపేట జిపిఓ రాములు, మంగపేట గ్రామపంచాయతీ కార్యదర్శి బి.సురేష్ తదితరులు పాల్గొన్నారు.
