Municipal elections | కుర్చీ ఫైట్ షురూ.. ఎక్కేది ఎవ్వరు.. ?

Municipal elections | కుర్చీ ఫైట్ షురూ.. ఎక్కేది ఎవ్వరు.. ?
- క్యాంప్ లో కౌన్సిలర్లు.. చైర్మన్, వైస్ ఛైర్మన్ పై సందిగ్దత
- మ్యాజిక్ ఫిగర్ దాటినా.. క్యాంప్ లోకి..!
- క్యాంప్ లో పదవుల పందేరం..!
- 16 న చైర్మన్ ,వైస్ చైర్మన్ పరోక్ష ఎన్నిక
Municipal elections, మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో గెలుపొంది మ్యాజిక్ ఫిగర్ దాటి.. మెజార్టీ కౌన్సిలర్ లను గెలిచినప్పటికి చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాస్త కౌన్సిలర్ లను క్యాంప్ కి తరలించారు. మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాస్త ఎస్సి మహిళలకు కేటాయించడం.. 2,6,12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపిన ఎస్సి మహిళా అభ్యర్థులు ఏకంగా ముగ్గురు గెలుపొందడంతో.. కాంగ్రెస్ అధిష్టానం అయోమయంలో పడ్డారు. కేవలం 2,6 వార్డులు మాత్రమే ఎస్సి మహిళకు రిజర్వ్ కావడంతో 12 వ వార్డులో జనరల్ మహిళ కోటాలో సైతం కాంగ్రెస్ పార్టీ ఎస్సి మహిళా అభ్యర్థి మెంట రమణ నగేష్ ని రంగంలోకి దింపింది.
దీంతో ఆ 3 వార్డుల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ ఎస్సి మహిళలు కౌన్సిలర్ లుగా గెలుపొందడంతో చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలో తెలియక అధిష్టానంకి తలనొప్పిగా మారింది. ఈ నెల 16న మోత్కూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు పరోక్ష ఎన్నిక ఉండడంతో.. కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ అభ్యర్థి ఎంపికలో బడా నాయకులు తలమునకలయ్యారు. దీంతో చేసేది ఏమి లేక ఎట్టకేలకు భువనగిరిలో ఎన్నికల కౌంటింగ్ అనంతరం స్థానిక వివేరా హోటల్ లో సమావేశమై పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఏకంగా 8 మంది కౌన్సిలర్లను క్యాంప్ కి తరలించారు.
చైర్మన్ పదవి మాదిగల కా..? మాల సామాజిక వర్గానికా..?
మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో 2 వ వార్డ్ లో మాల సామాజిక వర్గానికి చెందిన కుర్మిళ్ల ప్రమీల రాములు 6 ,12 వ వార్డులో మాదిగ సామాజిక వర్గానికి చెందిన గడ్డం స్వప్న సోమనర్సయ్య, మెంట రమణ నగేష్ లు గెలుపొందారు. ప్రమీల రాములు గతంలో వార్డ్ మెంబర్ గా, ఎంపీటీసీ గా పని చేశారు. గత ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయారు. రమణ నగేష్ గతంలో వార్డ్ మెంబర్ గా పని చేశారు. గత ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ స్వప్న సోమనర్సయ్యలు ఈ సారి కొత్తగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి తొలిసారి కౌన్సిలర్ గా గెలుపొందారు. ఒక్క స్థానంలో మాల సామాజిక వర్గం, 2 స్థానాల్లో మాదిగ సామాజిక వర్గం గెలుపొందడంతో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మోత్కూర్ లో అత్యధిక జనాభా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
వైస్ చైర్మన్ పై సందిగ్దత…
ఎస్సి మహిళ కి చైర్మన్ పదవి రిజర్వ్ కావడంతో, పురుషులను వైస్ చైర్మన్ గా ఎన్నుకునే అవకాశం ఉంది.1,7,9,11 వార్డులలో గెలుపొందిన కౌన్సిలర్లకు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ 2 రోజుల్లో క్యాంప్ రాజకీయాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
క్యాంప్ టూ కార్యాలయం…!
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన అనంతరం క్యాంప్ లోకి వెళ్ళిన కౌన్సిలర్లు.. అక్కడ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పదవుల పందేరం పూర్తి చేసుకొని ఈ నెల 16 న సోమవారం క్యాంప్ నుండి నేరుగా మున్సిపల్ కార్యాలయంకి రానున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీ లలో తిరుమలగిరి చైర్మన్ పీఠం గులాబీ పార్టీ కైవసం చేసుకోగా… ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మోత్కూర్ మున్సిపాలిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ అధిష్టానం, కార్యకర్తల అభీష్టం మేరకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు పార్టీ కోసం కష్టపడ్డ నికార్సైన కార్యకర్తలకు అందించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
