Bangla Judgment : స్వేచ్ఛ.. శాంతికే పట్టం Andhra Prabha Analysis

Bangla Judgment : స్వేచ్ఛ.. శాంతికే పట్టం Andhra Prabha Analysis
మతం ఘర్షణలొద్దు
నిరుద్యోగం అంతం
బంగ్లాదేశ్ ఫస్ట్ పాలసీ బెస్ట్
ఎన్నికల్లో బీఎన్పీ ప్రభంజనం
( ఆంధ్రప్రభ, ఎనాలిసిస్ వింగ్)

ఇటు మితిమీరిన నిరుద్యోగం. అటు ఆర్థిక సంక్షోభం. మరో వైపు అంతులేని హింస.. భరించలేక నానా తంటాలు పడుతున్న బంగ్లాదేశ్ ప్రజలు.. శాంతి, స్వేచ్ఛకే పట్టం కట్టారు. బంగ్లా ప్రజలు (Bangla Judgment) స్పష్టమైన తీర్పు ఇచ్చారు. 2026 ఫిబ్రవరి 12, న జరిగిన బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికలలో తారిక్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. మొత్తం 299 స్థానాలకు గాను బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) 213 స్థానాల్లో విజయ ఢంకా మోగించి. మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించింది. 11 పార్టీల ఇస్లామిక్ కూటమి కి నాయకత్వం వహించిన జమాతే-ఇ-ఇస్లామీ పార్టీ 70 స్థానాలను గెలుచుకుని దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 2024 విద్యార్థి ఉద్యమం నుండి పుట్టుకొచ్చిన నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) తొలిసారిగా 6 స్థానాలను గెలుచుకుని పార్లమెంటులో అడుగుపెట్టబోతోంది.
Bangla Judgment : శాంతి స్వేచ్ఛకే పట్టం

గత రెండేళ్లుగా విద్యార్థి ఉద్యమం, మతవాదన పార్టీల అలజడితో బంగ్లాదేశ్ అట్టుడిగిపోయింది. నిత్యం హింసతో జనం అల్లాడిపోయారు. తత్కాలిక ప్రభుత్వం ఈ హింసను అడ్డుకోవటంలో విఫలమైంది. కానీ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల నిర్వహణలో సత్ఫలితాలు ఇచ్చింది. ఇక అవినీతి, అసమర్థ పాలనతో సతమతమవుతున్న తరుణంలో.. దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ ప్రవాసం తర్వాత బంగ్లాదేశ్ కు తిరిగి వచ్చిన బీఎన్ పీ అధినేత తారిక్ రెహమాన్ ప్రధానిగా పీఠాన్ని అధిష్టించనున్నారు. బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ పార్టీ అధినేత్రి హసీనా బేగంపై తిరుగుబాటు.. అనంతరం జరిగిన పరిణామాలను పక్కన పెడితే.. 2025 డిసెంబర్ 25 నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చారు. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత, దేశంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని తొలగించగల నాయకుడిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) శ్రేణులు తారిక్ రెహమాన్ ను గుర్తించాయి. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టాయి. తారిక్ రెహ్మాన్ స్వయంగా బొగురా-6 , డాకా-17 నియోజకవర్గాల నుండి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఫిబ్రవరి 14న ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని నివేదికలు తెలుపుతున్నాయి.
Bangla Judgment : హసీనాపై తిరుగుబాటు

బంగ్లాదేశ్‌లో సుమారు 15 ఏళ్లపాటు తిరుగులేని శక్తిగా వెలుగొందిన షేక్ హసీనా ప్రభుత్వం 2024 ఆగస్టులో పతనం కాక తప్పలేదు. హసీనా ప్రభుత్వం పతనానికి కోటా సంస్కరణల ఉద్యమం నాంది పలికింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 1971 స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు 30% రిజర్వేషన్లు కల్పించే విధానాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విధానం మెరిట్‌కు అన్యాయం చేస్తోందని, కేవలం హసీనా అనుకూల వర్గాలకే మేలు చేస్తుందని నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా ప్రారంభమైన విద్యార్థి నిరసనలను ప్రభుత్వం బలవంతంగా అణిచివేయాలని చూసింది.

పోలీసుల కాల్పులు, హింసాత్మక చర్యలతో వందలాది మంది విద్యార్థులు మరణించడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఇది కాస్తా ‘హసీనా రాజీనామా’ అనే ఏకైక డిమాండ్‌తో ప్రజా ఉద్యమంగా మారింది. దేశంలో నిరుద్యోగం పెరగడం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆర్థిక వృద్ధి జరుగుతున్నట్లు కనిపించినా, ఆ సంపద కేవలం అధికార పార్టీకి దగ్గరగా ఉన్నవారికే చేరుతోందనే విమర్శలు వచ్చాయి. హసీనా ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, ప్రతిపక్షాలను అణచివేస్తోందని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరిగిందని, అక్రమంగా సంపదను విదేశాలకు తరలించారని ఆరోపణలు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. 2024 జనవరిలో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనకపోవడం, ఆ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదనే ఆరోపణలు హసీనా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీశాయి. చివరగా, నిరసనకారులపై కాల్పులు జరపడానికి సైన్యం నిరాకరించటంతో పరిస్థితి చేయి దాటిపోవడంతో హసీనాకు రాజీనామా చేసి దేశం విడవక తప్పలేదు. ఈ కారణాలన్నీ కలిసి బంగ్లాదేశ్‌లో ఒక భారీ ప్రజా విప్లవానికి దారితీసి, షేక్ హసీనా సుదీర్ఘ పాలనకు ముగింపు పలికాయి.
Bangla Judgment : అనిశ్చితి… అశాంతి

2024 జూలైలో ప్రారంభమైన బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమం నిత్య ఘర్షణలకు దారి తీసింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం 2025 ఫిబ్రవరిలో విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, జూలై 15 నుండి ఆగస్టు 5 మధ్య జరిగిన హింసలో సుమారు 1,400 మంది వరకు మరణించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నవంబర్ 2024లో సుమారు 1,500 మంది మరణించినట్లు పేర్కొంది. ‘స్టూడెంట్స్ ఎగైనెస్ట్ డిస్క్రిమినేషన్’ అనే విద్యార్థి సంఘం ఈ సంఖ్య 1,581 గా ఉండవచ్చని తెలిపింది. మరణించిన వారిలో కనీసం 32 మంది చిన్నారులు ఉన్నట్లు యునిసెఫ్ (UNICEF) ధృవీకరించింది. ఈ అల్లర్లలో 20,000 కంటే ఎక్కువ మంది గాయపడగా, వందలాది మంది విద్యార్థులు తమ చూపును కోల్పోయారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) విచారణ జరుపుతోంది. ఇక ఈ బాధ్యత కొత్త ప్రభుత్వం తీసుకుంటుంది.
Bangla Judgment : తెర మీదకు తారిక్ రెహమాన్…

అవినీతి ఆరోపణలపై తారిక్ రెహమాన్ ను సైనిక మద్దతుతో 2007లో ఆపద్ధర్మ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కస్టడీలో ఆయనపై భౌతిక దాడులు, చిత్రహింసలు జరిగాయి. ఆయన వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. జైలు నుంచి విడుదలైన తర్వాత, వెన్నునొప్పి ఇతర అనారోగ్య సమస్యలకు మెరుగైన చికిత్స కోసం తారిక్ 2008 సెప్టెంబర్ లో లండన్‌కు వెళ్లారు. షేక్ హసీనా హయాంలో ఆయనపై హత్యాయత్నం (2004 గ్రెనేడ్ దాడి కేసు), అవినీతి వంటి అనేక కేసులు నమోదయ్యాయి. స్వదేశానికి వస్తే అరెస్ట్ అవుతారనే భయంతో ఆయన దాదాపు 17 ఏళ్ల పాటు లండన్‌లోనే స్వీయ ప్రవాసంలో గడిపారు. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తారిక్ పై ఉన్న ప్రధాన కేసులను కోర్టులు కొట్టివేయడంతో, ఆయన మళ్ళీ స్వదేశానికి చేరుకుని ఫిబ్రవరి 2026 ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషించారు.
Bangla Judgment : తిరుగులేని జనం సానుభూతి

తారిక్ తల్లి, మాజీ ప్రధాని ఖలీదా జియా (Khaleda Zia) తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆయన దేశానికి తిరిగి వచ్చారు.

ఆయన వచ్చిన కొద్ది రోజులకే (డిసెంబర్ 2025 చివరలో) ఆమె మరణించారు. ఒక కుమారుడిగా తల్లి చివరి క్షణాల్లో ఆమెకు తోడుగా ఉండలేకపోయారనే భావన , ఆమె అంత్యక్రియల సమయంలో ఆయన పట్ల ప్రజల్లో భారీ సానుభూతి వెల్లువెత్తింది. తారిక్ భార్య జుబేదా రెహ్మాన్ పట్ల కూడా ప్రజల్లో సానుకూలత ఉంది. ఆమె ఒక ప్రముఖ వైద్యురాలు, గౌరవప్రదమైన కుటుంబ నేపథ్యం కలిగిన వ్యక్తి కావడంతో, ఆమెపై రాజకీయంగా మోపబడిన కేసులు ప్రజల్లో సానుభూతిని కలిగించాయి.
Bangla Judgment : ఢిల్లీ కాదు.. పిండి కాదు

“బంగ్లాదేశ్ ఫస్ట్” పాలసీ తో తారిక్ రెహ్మాన్ “ఢిల్లీ కాదు, పిండి (రావల్పిండి) కాదు, బంగ్లాదేశే ముఖ్యం” అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. గత ప్రభుత్వంలా కాకుండా, అన్ని దేశాలతో సమాన దూరాన్ని పాటిస్తూ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. తారిక్ రెహ్మాన్ వచ్చే ఐదేళ్లలో దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టటమే అయన ప్రధాన ఏజెండా. 2034 నాటికి బంగ్లాదేశ్‌ను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికలతో పాటు జరిగిన ‘జూలై చార్టర్’ ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలు మద్దతు తెలిపారు. దీని ప్రకారం ద్విసభా పార్లమెంటు (Bicameral Parliament) వ్యవస్థను ప్రవేశపెట్టడం అధ్యక్ష, ప్రధాని అధికారాల మధ్య సమతుల్యత తీసుకురావడం వంటి సంస్కరణలు అమలు కానున్నాయి. “మతం వ్యక్తిగతం, కానీ దేశం అందరిది” అని ప్రకటిస్తూ, హిందూ మైనారిటీలతో సహా అందరికీ భద్రత కల్పిస్తామని తారిక్ హామీ ఇచ్చారు.
Bangla Judgment : కీలక సవాళ్లు
నదీ జలాల పంపిణీలో తమకు న్యాయమైన వాటా కావాలని BNP గట్టిగా కోరుతోంది.సరిహద్దుల్లో కాల్పులు, అక్రమ వలసల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని BNP మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని కొత్త ప్రభుత్వం కోరే అవకాశం ఉంది,

ఇది ఇరు దేశాల మధ్య కొంత ఉద్రిక్తతకు దారితీయవచ్చు. , బంగ్లాదేశ్‌లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం భారత్‌తో ఆర్థిక , వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించాలనుకున్నప్పటికీ, కొన్ని సున్నితమైన అంశాలలో మరింత ప్రశ్నించే ధోరణిని ప్రదర్శించే అవకాశం ఉంది. భారతదేశం కొత్త BNP ప్రభుత్వం మధ్య సంబంధాలు “సమానత్వం పరస్పర గౌరవం” ప్రాతిపదికన సాగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితాల అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ తారిక్ రెహ్మాన్‌కు అభినందనలు తెలుపుతూ, ప్రజాస్వామ్య, సమగ్ర బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు. చైనా పెట్టుబడులు , అమెరికా మద్దతు మధ్య సమతుల్యతను కాపాడుకుంటూ దేశ ప్రయోజనాలను కాపాడటం, ప్రస్తుతం బంగ్లాదేశ్ అసలు టార్గెట్.
