Rs. 2,200 crore | విలువైన ప్రభుత్వ భూమిని

Rs. 2,200 crore | విలువైన ప్రభుత్వ భూమిని

  • కబ్జాదారుల చెర నుంచి కాపాడింది…

Rs. 2,200 crore | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : హైడ్రా మహా నగరం హైదరాబాద్ లో మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలోని మొండికుంటలో ఆక్రమణలను తొలగించి రూ.2,200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించింది. స‌ర్వే నంబ‌రు 53లోని మొండికుంట‌తో పాటు, స‌ర్వే నంబ‌రు 55లోని ప్రభుత్వ భూమి ఎక‌రాల‌ కొద్దీ ఆక్రమణకు గురవుతోందని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఆదేశాల‌ మేర‌కు రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారుల‌తో క‌లిసి హైడ్రా క్షేత్ర స్థాయిలో విచారించింది. దాదాపు 11 ఎక‌రాల ప్రభుత్వ భూమి క‌బ్జాకు గురైన‌ట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఆల‌యాన్ని హ‌ద్దుగా చూపించి క‌బ్జాదారులు ఆక్రమణలకు పాల్పడినట్టు నిర్ధారించారు. ఆల‌యం హ‌ద్దుగా ప‌లు షాపులు, మెకానిక్ షెడ్డులు, ఐర‌న్ స్టీల్ షాపు ఇలా ప‌లు ర‌కాల షెడ్డులు వేసి వ్యాపారాలు చేస్తున్నట్టు గుర్తించారు.

30కి పైగా ఉన్న షాపుల ద్వారా నెల‌కు రూ.లక్షల్లో అద్దె వ‌సూలు చేస్తూ కబ్జాదారులు సొమ్ము చేసుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో వాటిని తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణలు తొల‌గించిన చోట పార్కుల‌ను అభివృద్ధి చేయాల‌ని స్థానికులు హైడ్రా అధికారుల‌ను కోరారు.

Leave a Reply