Students | విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

Students | విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
- పరీక్షలు విద్యార్థుల ప్రతిభను మాత్రమే పరీక్షిస్తాయి
- ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ
Students | అచ్చంపేట, ఆంధ్రప్రభ : పదవ తరగతి విద్యార్థులు భయాన్ని పక్కనపెట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, నాగర్‌కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సూచించారు. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలోని స్థానిక ఫంక్షన్ హాల్లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఈ రోజు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో విద్యకు అత్యంత ప్రాధ్యాన్యతనిస్తన్నదని అన్నారు. పదవ తరగతి విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన సంవత్సరం అని అన్నారు. ఇది కేవలం పరీక్షల సంవత్సరం మాత్రమే కాకుండా, భవిష్యత్‌ను నిర్ణయించే బలమైన పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు మూడు విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, టైమ్ టేబుల్ తయారు చేసుకుని క్రమశిక్షణతో పాటించాలని, చదివిన పాఠాలను మళ్లీ మళ్లీ పునశ్చరణ చేయాలని సూచించారు.

భయంతో కాదు, సరైన ప్రణాళికతో చదివితే పదవ తరగతి చాలా సులభంగా పూర్తి చేయవచ్చని తెలిపారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. పరీక్షలు తమ ప్రతిభను పరీక్షించేందుకు మాత్రమేనని, తమ విలువను నిర్ణయించేవి కావని స్పష్టం చేశారు. అందుకే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థులందరికీ ఉత్తమ ఫలితాలు రావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల మేనేజ్మెంట్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో పదవ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.
