Temple | ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Temple | ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : ఈవో ఎం. రవిచంద్ర

Temple | తిరుపతిరూరల్, ఆంధ్రప్రభ : చంద్రగిరి శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం 8.15 నుండి 8.35 గంటల మధ్య కుంభ లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంతకుముందు ఉదయం 6.30 నుండి 8.15 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు.

Temple

అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మీన‌ లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకణబట్టార్‌ బాలాజి రంగాచార్యులు ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : ఈవో శ్రీ ఎం. రవిచంద్ర టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ, ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.

Temple

ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 8 నుండి 16వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న బ్ర‌హ్మోత్స‌వాల‌ను అత్యంత వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌న్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 12న గరుడసేవ, ఫిబ్ర‌వ‌రి 13న స్వర్ణరథోత్సవం, ఫిబ్ర‌వ‌రి 15న రథోత్సవం, ఫిబ్ర‌వ‌రి 16న చక్రస్నానం జరుగనున్నట్టు వివరించారు.గరుడ సేవ రోజు భక్తుల రద్దీ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఈవో వి. వీరబ్రహ్మం సివిఎస్ఓ మురళీకృష్ణ, ఆలయ ప్ర‌త్యేకాధికారి మ‌రియు సిపిఆర్వో డా.టి.ర‌వి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్‌, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్‌, ధ‌న శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply