AP | కూటమి ప్రభుత్వం విలువలకు కట్టుబడి…
AP | కూటమి ప్రభుత్వం విలువలకు కట్టుబడి…
- ఇచ్చిన మాట ప్రకారం ఒక్క రూపాయి విద్యుత్ చార్జీలు పెంచలేదు
- నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా
- నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రి గొట్టిపాటి
AP | గిద్దలూరు, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం విలువలకు కట్టుబడి పని చేసే ప్రభుత్వమని, ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన అనంతరం ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండలంలోని చింతలపల్లి పంచాయితిలో నూతనంగా రూ 3.60.కోట్లతో నిర్మించిన 33/11 విద్యుత్ ఉప కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ వద్ద పూజలు నిర్వహించిన అనంతరం సబ్ స్టేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ప్రజలకు రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్తు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
గిద్దలూరు మార్కాపురం కనిగిరి ప్రాంతాల్లో నూతన విద్యుత్ సబ్స్టేషన్ ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, అందుకు అవసరమైన భూసేకరణ కూడా చేస్తున్నామని తెలిపారు. బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, గిద్దలూరులో కూడా బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుతోపాటుగా గిద్దలూరులో పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఎక్కడా లో వోల్టేజీ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట శివరామిరెడ్డి, ఒంగోలు విద్యుత్ శాఖ ఎస్. ఈ వెంకటేశ్వర్లు, గిద్దలూరు విద్యుత్ సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి శేషగిరిరావు కొమరోలు అసిస్టెంట్ ఇంజనీర్ ఎం శ్రీనివాసులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
