ప్రజా ప్రతినిధిగా కాదు ప్రజా సేవకులుగా పనిచేస్తా
ప్రజా ప్రతినిధిగా కాదు ప్రజా సేవకులుగా పనిచేస్తా
- 11వ వార్డు బిజెపి అభ్యర్థి జయశ్రీ చిన్న కొండయ్య
మక్తల్ , ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా ప్రజాసేవకులుగా మీ అందరి ఇంటి మనిషిగా వార్డు అభివృద్ధి కోసం పని చేస్తానని 11వ వార్డు బిజెపి అభ్యర్థి జయశ్రీ చిన్న కొండయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వార్డు పరిధిలోని ఆజాద్ నగర్ ,రెడ్డి నగర్ ,వినాయక నగర్ ప్రాంతాల్లో జోరుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న పార్టీ నాయకుల నినాదాలతో ప్రచార ప్రాంతమంతా హోరెత్తింది.
ఇంటింటికి వెళ్లి ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని తనను ఆదరించి అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. స్థానికులుగా ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని అన్నారు. మునిసిపాలిటీల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సాధ్యమని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉండటం వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చే బాధ్యత తమదని అన్నారు .ఈ ప్రాంతాన్ని ఆదర్శ వారుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. అభివృద్ధితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించే విధంగా చూస్తానని భరోసా ఇచ్చారు .
మీ బిడ్డగా ప్రతి ఒక్కరూ తనకు అండగా నిలవాలని అభ్యర్థించారు.అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల మాయమాటలకు నమ్మి మోసపోయి గోసపడవద్దని అన్నారు. 11న జరగనున్న ఎన్నికల్లో అభివృద్ధి కోసం కమలం గుర్తుకు ఓటు వేసి తనను కౌన్సిలర్‌గా గెలిపించవలసిందిగా బిజెపి అభ్యర్థి జయశ్రీ చిన్న కొండయ్య విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాగనూర్ మండల అధ్యక్షులు జయానందన్ రెడ్డి,నాయకులు చిన్న కొండయ్య ,బి. కుర్మయ్య ,చెన్నారెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ,బాబురావు,గుడిసె ఆంజనేయులు, దండు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
