AP | లడ్డు కల్తీపై జగన్ వ్యాఖ్యలు అసత్యం..

AP | లడ్డు కల్తీపై జగన్ వ్యాఖ్యలు అసత్యం..
- సీబీఐ–సిట్ నివేదికతో వైసీపీ బండారం బట్టబయలు
- దేవదేవుని ప్రసాదాన్ని కూడా రాజకీయాలకు వాడుకున్నారని టీడీపీ ఆరోపణ
AP | విజయవాడ, ఆంధ్రప్రభ : తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) లడ్డు కల్తీ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, తాజాగా విడుదలైన సీబీఐ,సిట్ నివేదికతో స్పష్టమైందని తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శిత్ పొట్లూరి ఆరోపించారు. గతంలో లడ్డు కల్తీపై ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ఆవులు సరిగా మేత మేయకపోయినా ఆ పాలతో తయారైన నెయ్యి కల్తీ అయ్యే అవకాశం ఉంది అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు సిట్ నివేదిక గట్టి సమాధానం ఇచ్చిందని ఆయన తెలిపారు. సిట్ నివేదిక ప్రకారం అక్కడ అసలు ఆవులే లేవని, పాలు లేవని, నెయ్యి కూడా కాదని, అది పూర్తిగా కలుషిత రసాయనాలు, కొవ్వుల మిశ్రమమని నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు.
గత రెండు,మూడు దశాబ్దాలుగా తిరుమలకు కర్ణాటక ప్రభుత్వ సంస్థ అయిన నందిని డెయిరీ ద్వారా స్వచ్ఛమైన ఆవు నెయ్యి సరఫరా జరుగుతుండగా, వైసీపీ పాలనలో టీటీడీ నిబంధనలు మార్చి ఆవులే లేని ఏఆర్ డెయిరీ, భోలే బాబా డెయిరీ వంటి సంస్థలకు టెండర్లు కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి దాగి ఉందని దర్శిత్ ఆరోపించారు. కమీషన్ల కక్కుర్తితో దేవదేవుని ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారని, ఇది కోట్లాది భక్తుల మనోభావాలకు తీవ్ర దెబ్బని ఆయన విమర్శించారు. టీటీడీ విషయంలో జగన్ మొదటి నుంచీ నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శించారని తెలిపారు.
భారతరత్న అబ్దుల్ కలాం తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్‌పై సంతకం చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారని గుర్తు చేసిన ఆయన, జగన్ మాత్రం డిక్లరేషన్‌పై సంతకం చేయకుండా కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు రెండు ఆంబోతులను వదిలి, వాటితో దూషణలు చేయిస్తూ, కాపు,బీసీ నాయకుల పేర్లతో కుల ప్రస్తావన తెరపైకి తీసుకువస్తున్నారని ఆరోపించారు. గతంలో తన ప్రభుత్వ హయాంలో మాచర్లలో టీడీపీ నేతలైన బొండా ఉమా, బుద్దా వెంకన్నలపై దాడులు జరిగినప్పుడు గుర్తు రాని కులం ఇప్పుడు ఎందుకు గుర్తొస్తోందని ప్రశ్నించారు. లడ్డు కల్తీ వ్యవహారంలో పూర్తి నిజాలు బయటకు రావడంతో వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై ప్రజలు స్పష్టంగా అవగాహనకు వస్తున్నారని, ఈ అంశంపై సీబీఐ, సిట్ దర్యాప్తు కొనసాగాలని దర్శిత్ డిమాండ్ చేశారు.
