AP | నిర్మలమ్మ బడ్జెట్ భేష్…
AP | నిర్మలమ్మ బడ్జెట్ భేష్…
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
AP | ఆంధ్రప్రభ న్యూస్ బ్యూరో, శ్రీకాకుళం : వరుసగా తొమ్మిదవ సారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ దేశాభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, రైతులు, యువత మీద ప్రత్యేక దృష్టి పెడుతూ కూర్పు చేశారని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర బడ్జెట్ పై ప్రసంశల జల్లు కురిపిస్తూ అయన శ్రీకాకుళం క్యాంపు కార్యాలయం నుండి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. విదేశీ యాత్రలపై పన్ను తగ్గింపు జరగడం.. పౌర విమానయాన రంగానికి మరింత ఊతమిస్తుందని తెలిపారు. ప్రధాన మంత్రి వికసిత్ భారత్ లక్ష్యాలను మరింత వేగంగా చేరుకునేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. పౌర విమానాల విడిబాగాలపై పన్ను తగ్గించడంతో పాటు, తన శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన పంటగా ఉన్న కొబ్బరి కోలుకునేలా తోడ్పాటు అందివ్వడం శుభపరిణామం అని అన్నారు.
ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026–27 కేంద్ర బడ్జెట్, స్థిరమైన ఆర్థిక విధానంతో పాటు పెట్టుబడులు, సంస్కరణలపై బలమైన దృష్టి పెట్టడం ద్వారా, భారతదేశానికి మరింత ప్రగతిని, సుస్థిర అభివృద్ధిని తీసుకురాగలిగిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం సామాన్యులను మరింత ఆకట్టుకుందని తెలిపారు. ఏడు నగరాల మధ్య హై స్పీడ్ కారిడార్లు, టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ, డేటా సెంటర్ల ఏర్పాటుకు తోడ్పాటు అందివ్వడం.. ఇలా ప్రతీ అంశం ప్రగతిని సూచిస్తోందని అన్నారు.
ప్రస్తుత ప్రపంచ అస్థిరతల నడుమ కూడా, ప్రభుత్వం బలమైన స్థిరమైన ఆర్థిక విధానాన్ని పాటిస్తోందని, 2026–27 కి కేంద్ర పెట్టుబడులను గతంలో కంటే అధికంగా 12.2 లక్షల కోట్లకు పెంచడం ద్వారా ప్రభుత్వం తన విజన్ ను స్పష్టం చేసిందని అన్నారు. ఈ పెట్టుబడులు తన శాఖా పరిధిలోని పౌర విమానయానం, విమానాశ్రయాలతో పాటు రైల్వేలు, రహదారులు, పోర్టులు, లాజిస్టిక్స్, పట్టణ మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లపై ఉన్నాయని అన్నారు. ఇది ఉపాధి, పెట్టుబడులు, పెట్టుబడిదారు విశ్వాసానికి సహాయపడుతుందని స్పష్టం చేశారు. ప్రతీ జిల్లాలో బాలికల వసతి గృహం.. గొప్ప ఆలోచన అని అన్న రామ్మోహన్ నాయుడు.. బాలికా విద్య మరింత ఉన్నతంగా ప్రకాశిస్తుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్ధిక తోడ్పాటు అందిస్తూ నిర్మలమ్మ పద్దులు ఉండటం, అందులో ఆంధ్రప్రదేశ్ కు సైతం సింహ భాగం కేటాయింపులు జరగడం ఆనందంగా ఉందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన పంటగా ఉన్న కొబ్బరికి తోడ్పాటు అందించే విధంగా కొబ్బరి ప్రోత్సాహక పధకం.. ఉద్దాన ప్రాంతానికి మళ్ళీ పూర్వ వైభవాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జీడి పంటకు సైతం తోడ్పాటు అందించే విధంగా కేటాయింపులు ఉండటం శుభపరిణామం అని అన్నారు.
