Collector | బాల్య వివాహాల నిరోధానికి కృషి ..

Collector | బాల్య వివాహాల నిరోధానికి కృషి ..

  • పశ్చిమ కలెక్టర్ చదలవాడ నాగరాణి

Collector | భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలో బాల్య వివాహాలు నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బాల్య వివాహ ముక్తభారత్ వంద రోజులు కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం, చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా రూపొందించిన “బాల్య వివాహ విముక్తి రథం” ను ఈ రోజు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ

సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాను బాల్యవివాహారహిత జిల్లాగా తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బాల్యవివాహాన్ని అరికడదాం – ఆడపిల్లను చదివిద్దాం అనే స్లోగన్ తో ముందుకు వెళ్లాలన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదని, అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సిబ్బందితో సమాచార వ్యవస్థను రూపొందించుకొని బాల్య వివాహాల నిరోధకానికి కృషి చేయాలన్నారు.

జిల్లాలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 11వ తేదీ వరకు జిల్లా అంతటా ప్రచార రథం ప్రతి గ్రామం, ప్రతి వార్డులో విస్తృతంగా పర్యటించి ప్రజల్లో అవగాహన, చైతన్యం తీసుకురావడం ద్వారా బాల్యవివాహాల నిర్మూలనా లక్ష్యమే దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే పిల్లల భవిష్యత్తు నాశనం చేయడమే కాకుండా వారి ఆరోగ్యం విద్య సామాజిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు.

21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అబ్బాయికి, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయికి బాల్య వివాహం చేయడం చట్టరీత్యా నేరం అన్నారు. బాల్య వివాహం చేసినందుకు తల్లిదండ్రులు, వివాహానికి హాజరైన బంధు, మిత్రులకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చుఅని హెచ్చరించారు. బాల్య వివాహాలు చేసే పండితులు, మౌల్వీలు, పూజారులను కూడా శిక్షలు ఉంటాయన్నారు.

బాల్య వివాహాలకు సేవలు అందించే వ్యక్తికి, బేకరి, మిఠాయి తయారీదారు, బ్యాండ్, టెంట్ యజమాని లేదా ఇందులో పాల్గొన్న ఎవరైనా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.ఒక లక్ష వరకు జరిమానా లేదా రెండూ విధించడం జరుగుతుందన్నారు. బాల్యవివాహం చేసిన వ్యక్తికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు అని తెలిపారు.

Leave a Reply