Snow |అమెరికాను క‌ప్పేసిన మంచు

అమెరికాను క‌ప్పేసిన మంచు

  • తుఫాన్ ప్ర‌భావంతో వ‌ణికిపోతున్న ప్ర‌జ‌లు
  • ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్న జ‌నం
  • విమాన సర్వీసులకు ఆటంకం

Snow |వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. పలు రాష్ట్రాల్లో భారీగా హిమపాతం కురుస్తుంది. పదిహేను కోట్ల మందికి పైగా ప్రజలు గడ్డ కట్టే చలిలో వణికిపోతున్నారు దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. టెక్సాస్, ఓక్లహోమాపై మంచు తుపాను విరుచుకుపడుతుంది. మంచు తుపాను కారణంగా 8 వేలకు పైగా విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగింది. శనివారం నాటికి 3,200 విమానాలు, ఆదివారం 4,800 విమాన సర్వీసులు రద్దైనట్లు అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో రవాణా సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగవచ్చని అంచనా వేశారు. మంచు తుపాను కారణంగా 20 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రభావితం కానున్నట్లు యూఎస్ అధికారులు వెల్లడించారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది.

అమెరికా వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా వైట్ వాష్ కనిపిస్తోంది. జనవరి 23, శుక్రవారం నుంచి మొదలైన ఈ ‘వింటర్ స్టార్మ్ ఫెర్న్’ తుఫాన్ ప్రభావం సోమవారం (జనవరి 26) వరకు తీవ్రంగా ఉండబోతోంది. సౌత్, మిడ్-వెస్ట్, నార్త్-ఈస్ట్ ప్రాంతాల్లోని దాదాపు 23 కోట్ల మంది ప్రజలు ఈ తుఫాను గుప్పిట్లో చిక్కుకున్నారు. మంచుతో రోడ్లు, చెట్లు, విద్యుత్ లైన్లను ప్రమాదకరంగా మారుస్తుంది. దీనివల్ల విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుంది. రోడ్లు మూసుకుపోతాయి. ఈశాన్యంలోని కొన్ని ప్రదేశాలలో ఒక అడుగు కంటే ఎక్కువ మంచు పేరుకుపోవచ్చు. దీంతో ప్రయాణాలు చాలా కష్టమవుతుందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

బ‌డుల‌కు హాలీడేస్
చికాగో, ఇతర మిడ్‌వెస్ట్రన్ నగరాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విమానయాన సంస్థలు వేలాదిగా విమానాలను రద్దు చేశారు. చర్చిలు, సన్ డే ఈవెంట్స్ ను, కార్నివాల్ ను రద్దు చేశారు. టెక్సాస్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో విద్యుత్ కు అంతరాయం కలిగింది. తుపాను ముగిసిన తర్వాత మంచు తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. చెట్లు, విద్యుత్ లైన్లు పడిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది.

బ‌య‌ట‌కు అడుగు పెట్ట‌లేక‌..
తుపాను తీవ్రత పెరుగుతుండడంతో.. కొన్ని రోజులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుందని, ప్రజలు ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు. చికెన్, గుడ్లు, పిజ్జాలను తీసుకుంటున్నారు. టెక్సాస్‌లోని లుబ్బాక్‌లో మంచుతో రోడ్లు నిండిపోయాయి. మంచు తుపాను ఈశాన్య దిశగా కదులుతుంది. వాషింగ్టన్ నుండి న్యూయార్క్, బోస్టన్ మీదుగా కదులుతుందని జాతీయ వాతావరణ శాఖ అంచనా వేసింది.

మంచు తుపాన్‌ అతి తీవ్రం
కెంటకీ, వర్జీనియా, కాన్సస్, ఆర్కాన్సాస్‌, జార్జియా, మిసిసిపి సహా చాలా రాష్ట్రాల్లో వాతావరణ ఎమర్జెన్సీ విధించారు. మిసిసిపి, ఫ్లోరిడా వంటి దక్షిణాది రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మిస్సోరి, ఇల్లినోయీలలోనూ భారీ మంచు కురుస్తుంది. ప్రతికూల వాతావరణంతో వాహనాలు మంచులో కూరుకుపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ దశాబ్దిలోనే అతి తీవ్రమైన మంచు తుపానుగా చెబుతున్నారు.

Leave a Reply