Makthal | మీ ఆశీస్సులతోనే నాడు సర్పంచీగా నేడు రాష్ట్ర మంత్రిగా…

Makthal | మీ ఆశీస్సులతోనే నాడు సర్పంచీగా నేడు రాష్ట్ర మంత్రిగా…

  • రూ.1035 కోట్లతో అభివృద్ధి పనులు…
  • పశు సంవర్ధక క్రీడల శాఖ‌ మంత్రి డా. వాకిటి శ్రీహరి

Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : మీ బిడ్డగా మీ అందరి ఆశీస్సులతో నాడు గ్రామ సర్పంచిగా నేడు రాష్ట్ర మంత్రిగా మీ ముందు ఉన్నానని మీ అందరి ఆదరాభిమానాలతో నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని రాష్ట్ర పశుసంవర్థక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. 72 ఏళ్లు పాలించిన 15 మంది ఎమ్మెల్యేలు చేయని అభివృద్ధి నేడు మీ అందరి ఆశీస్సులతో చేయగలుగుతున్నానని అన్నారు. మరింత అభివృద్ధి చేపట్టి నియోజకవర్గం ఆదర్శవంతంగాగా తీర్చిదిద్దుతానని అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కేంద్రంలో మక్తల్ పట్టణం మున్సిపల్ పరిధి లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఉదయాన్నే వార్డు లను సందర్శించిన మంత్రి నిర్మాణ దశలో ఉన్న పనులను పర్యవేక్షించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉన్న కాలనీల్లో మంత్రి పర్యటించి త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు వారికి వివరించారు. అనంతరం

పట్టణంలోని 1,11, 14 వ వార్డ్ లలో రూ.2కోట్ల 50 లక్షల తో చేపట్టిన డ్రైనేజీ, మంచి నీటి పైప్ లైన్ నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… 26 ఏళ్ళ వయస్సులో మక్తల్ సర్పంచ్ గా ఎన్నికయ్యానని, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అయ్యానంటే అది మక్తల్ ప్రజల దయతోనే అన్నారు. పీఏసిలో మేబెర్ గా గొప్ప అవకాశం రావడం, ఖమ్మం జిల్లాకి ఇంచార్జి మంత్రి గా ఉండడం కూడా నియోజకవర్గ ప్రజల చొరవ తోనే అని తెలిపారు. మక్తల్ నియోజకవర్గాన్ని 15మంది ఎమ్మెల్యేలు 72 సంవత్సరాల నుండి పాలించినా కూడా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక నేను మంత్రిని అయిన కొన్ని రోజుల వ్యవధిలోనే 1035 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి వాకిటి శ్రీహరి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాల్లో మక్తల్ ఒకటని ఆయన వెల్లడించారు. రాజకీయాలకతీతంగా అందరం కలిసి మక్తల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply