India energy policy | పునరుత్పాదక ఇంధనం వైపు భారత్‌ అడుగులు

India energy policy | పునరుత్పాదక ఇంధనం వైపు భారత్‌ అడుగులు

India energy policy | దిగుమతులపై ఆధారపడుతున్న ఇంధన వ్యవస్థ
రవాణా రంగంలో చమురు వినియోగం
దేశీయ అన్వేషణ – సాంకేతికతతో కొత్త దిశ
కృష్ణా-గోదావరి బేసిన్ అవకాశాలు
విధాన మార్పులు – HELP ప్రభావం
విదేశీ పెట్టుబడులు – వ్యూహాత్మక దిశ
అంతర్జాతీయ మార్కెట్ల అస్థిరత
అన్వేషణలో సవాళ్లు, పరిష్కారాలు

India energy policy | 140 కోట్ల జనాభా కలిగిన భారత్‌ తన ఇంధన అవసరాల్లో సుమారు 85 శాతం పైగా దిగుమతులపై ఆధారపడుతూ, సంవత్సరానికి దాదాపు రూ.150 బిలియన్‌ విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో, అస్థిర ప్రపంచంలో, తరచుగా తలెత్తుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం మన చమురు దిగుమతులపై పడటం అనివార్యం. దీంతో మన ఇంధన భద్రతపై ఆందోళనలు తలెత్తుతున్నాయి. అయితే, ఈ రంగంలో భారత్‌కు ఉన్న అవకాశాలు, తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, వాటి పురోగతి, భవిష్యత్‌ దిశలను సమగ్రంగా పరిశీలిస్తే, ఆందోళన స్థానంలో ఆత్మవిశ్వాసం, అనిశ్చితి స్థానంలో స్పష్టత ఏర్పడతాయి.

భారత్‌లో చమురు వినియోగం ప్రధానంగా రవాణా రంగంలో కేంద్రీకృతమై ఉంది. ప్రజా రవాణా, సరుకు రవాణా, పౌర విమానయాన రంగాలు దీనిపై విస్తృతంగా ఆధారపడుతున్నాయి. కొంతవరకు రైల్వేలు కూడా. వ్యవసాయ రంగంలో డీజిల్‌ పంపులు, ట్రాక్టర్లు వంటి యంత్రాలు ఈ వినియోగాన్ని మరింత పెంచుతున్నాయి. అదనంగా, వాణిజ్య, పారిశ్రామిక రంగాలతో పాటు డేటా, కృత్రిమ మేధస్సు, క్లౌడ్‌ కేంద్రాలు తమ బ్యాకప్‌ వ్యవస్థల్లో డీజిల్‌ను వినియోగిస్తున్నాయి. ఈ విధంగా వివిధ కార్యకలాపాలు చమురు వినియోగంపై నేరుగా ఆధారపడటం వల్ల, సరఫరాలో ఏ అంతరాయం జరిగినా దాని ప్రభావం తక్షణమే ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఈ ఆలంబనను దృష్టిలో ఉంచుకొని, శక్తి వనరుల ఉత్పత్తిని దేశీయంగా బలోపేతం చేయడం అత్యవసరం. అందులో భాగంగా, దేశీయ చమురు, గ్యాస్‌ అన్వేషణను విస్తరించడంలో ప్రభుత్వ రంగ నవరత్న సంస్థలైన ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌తో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కెయిర్న్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ వంటి ప్రైవేట్‌ సంస్థలు ముందంజలో ఉన్నాయి.

ముంబై హై వంటి సంప్రదాయ చమురు క్షేత్రాల్లో ఉత్పత్తి, లాభదాయకత తగ్గుతున్నప్పటికీ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం క్షీణదశలో ఉన్న ఈ క్షేత్రాలకు పునరుజ్జీవం కల్పిస్తోంది. ఇప్పటికే త్రవ్వబడిన బావుల్లో మిగిలిన చమురును నీరు, వాయువు, రసాయనాల సహాయంతో గరిష్టంగా వెలికితీసే ‘ఎన్‌హాన్స్‌డ్‌ ఆయిల్‌ రికవరీ’ పద్ధతులు, అలాగే భూమి అడుగున శిలా పొరల్లో దాగి ఉన్న నిల్వలను ధ్వని తరంగాల ఆధారంగా గుర్తించే ‘సైస్మిక్‌ ఇమేజింగ్‌’ సాంకేతికతలు కీలకంగా మారాయి.

దీనితో పాటు, కృష్ణా-గోదావరి బేసిన్‌ మరోసారి ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఒకప్పుడు ఆశలు రేకెత్తించిన ఈ ప్రాంతం సాంకేతిక సమస్యల వల్ల వెనుకబడినప్పటికీ, ఇప్పుడు సముద్రపు లోతుల్లో శక్తి నిల్వలను చేరుకునే డీప్‌ సీ డ్రిల్లింగ్‌ సామర్థ్యాలు, సముద్రగర్భంలోనే ఉత్పత్తి నిర్వహించే సాంకేతికత అభివృద్ధి చెందడంతో కొత్త అవకాశాలు తెరుచుకున్నాయి. అందుకే అధునాతన సాంకేతికత అవసరమైన క్షేత్రాల్లో ప్రైవేట్‌, బహుళజాతి సంస్థలను ఆకర్షించాలి. ఈ దిశగా మరిన్ని ఆర్థిక ప్రోత్సాహకాలు, అనుకూలమైన విధాన వాతావరణం కల్పించడం మంచి ఫలితాలను ఇస్తుంది. అధిక రిస్క్‌ అన్వేషణ కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం, రిస్క్‌ విభజన పద్ధతులను అమలు చేయడం ఉపయోగకరం.

సాంకేతికతతో పాటు విధానపరమైన మార్పులు కూడా ఈ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. 1990ల చివర్లో ప్రవేశపెట్టిన కొత్త అన్వేషణ మరియు అనుమతి పథకం ప్రైవేట్‌, విదేశీ సంస్థలకు రంగ ప్రవేశం కల్పించగా, దానికి కొనసాగింపుగా వచ్చిన హైడ్రోకార్బన్‌ అన్వేషణ మరియు అనుమతి పథకం (HELP) వ్యవస్థను మరింత సరళీకరించింది. HELP కింద అమలవుతున్న ‘ఓపెన్‌ ఏకరేజ్‌ లైసెన్సింగ్‌ విధానం’ ద్వారా కంపెనీలు తమకు ఆసక్తి ఉన్న ప్రాంతాలను స్వయంగా ఎంపిక చేసుకుని అన్వేషణకు ముందుకు రావచ్చు. దీనితో ఒకప్పుడు ప్రధానంగా ప్రభుత్వ రంగానికే పరిమితమైన చమురు రంగం ఇప్పుడు ఆరోగ్యకరమైన పోటీతో, మార్కెట్‌ ఆధారిత అన్వేషణ దిశగా అడుగులు వేస్తోంది.

అయితే, ఈ విధానాన్ని మరింత ఫలప్రదంగా మార్చడానికి కొన్ని కీలక చర్యలు అవసరం. కేటాయించిన బ్లాకులను నిర్ణీత కాలపరిమితిలో వాణిజ్య ఉత్పత్తి దశకు తీసుకెళ్లేలా స్పష్టమైన గడువులు నిర్దేశించడం, లక్ష్యసాధన ఆధారిత ప్రోత్సాహకాలు అమలు చేయడం అవసరం. అదనంగా, అధిక రిస్క్‌ ఉన్న అన్వేషణ ప్రాజెక్టుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం, రిస్క్‌ భాగస్వామ్య విధానాలను ప్రోత్సహించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చు.

ఇదే సమయంలో, భారతదేశంలో అన్వేషణ సాంద్రత ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. చమురు లేదా వాయువు ఉండే అవకాశమున్న సుమారు 83 కోట్ల ఎకరాల భూభాగంలో కేవలం 10-15 శాతం మాత్రమే విస్తృతంగా అన్వేషించబడింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ నిష్పత్తి 60-70 శాతం వరకు ఉంటుంది. అలాగే, HELP పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు 5.9 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో 140కి పైగా బ్లాకులు కేటాయించబడినప్పటికీ, వాటిలో అనేక ప్రాంతాలు ఇంకా సర్వేలు, త్రవ్వకాల దశలోనే ఉన్నాయి. వాణిజ్య ఉత్పత్తి దశకు చేరినవి మరింత పరిమితం. ఈ గణాంకాలు భారతదేశంలో ముందుముందు చమురు అన్వేషణ, వెలికితీతలకు విస్తృత అవకాశాలున్నట్లు సూచిస్తున్నాయి.

మరో ఆశాజనకమైన అంశం విదేశీ ఇంధన క్షేత్రాల్లో భారత్‌ పెట్టుబడులు. ఓఎన్‌జీసీ విదేశ్‌ ద్వారా రష్యాలోని సఖాలిన్‌-1, వాంకోర్‌ వంటి చమురు ప్రాజెక్టులతో పాటు, ఆఫ్రికాలోని మోజాంబిక్‌ వంటి సహజ వాయువు ప్రాజెక్టుల్లో కూడా భారత్‌ వ్యూహాత్మకంగా వాటాలను పెంచుకుంటోంది. సూడాన్‌, నైజీరియా వంటి దేశాల్లో కూడా చమురు, సహజ వాయువు క్షేత్రాల్లో భారత్‌ తన ఉనికిని విస్తరించింది. ఇవి కేవలం వ్యాపార పెట్టుబడులు మాత్రమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరిగినా లేదా సరఫరా అంతరాయాలు వచ్చినా ఇంధన లభ్యతకు భరోసానిచ్చే వ్యూహాత్మక ఆధారాలు.

ఇలా శక్తి వనరుల సాధికారిత దిశగా అడుగులు వేస్తున్న భారత్‌ ఇప్పుడు కేవలం ఇంధన కొనుగోలుదారుగా కాకుండా వ్యూహాత్మక పెట్టుబడిదారుగా మారుతోంది. రష్యాపై కొనసాగుతున్న పాశ్చాత్య దేశాల ఆంక్షల మధ్య తగ్గింపు ధరల ప్రయోజనాన్ని వినియోగించుకుంటూ ఆ దేశంతో చమురు కొనుగోళ్లు పెంచింది. అయితే ఈ లావాదేవీలు మారుతున్న అంతర్జాతీయ నియంత్రణల మధ్య పరిమిత సడలింపుల పరిధిలోనే కొనసాగుతున్నాయి. ఇదే విధంగా, ఇరాన్‌తో గతంలో అమలైన రూపాయి చెల్లింపు విధానం ఆంక్షల ప్రభావంతో నిలిచిపోవడం కూడా ఇందులో ఉన్న పరిమితులను తెలియజేస్తోంది. మరోవైపు, ఒపెక్‌లో అంతర్గత విభేదాలు, ఉత్పత్తి విధానాల్లో మార్పులు వంటి పరిణామాలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్ల అస్థిరతను సూచిస్తున్నాయి. ఈ అనుభవాలన్నీ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి—ఇంధన వ్యూహం కేవలం వనరుల సమీకరణతో ముగియదు; అది భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఆంక్షలు, అంతర్జాతీయ వ్యవస్థల మధ్య సమతుల్యతను సాధించాల్సిన నిరంతర ప్రక్రియ.

అయితే, ఈ ప్రయాణం సవాళ్లకు అతీతం కాదు. సముద్రగర్భ అన్వేషణ అత్యంత ఖరీదైనది; ఒక బావి త్రవ్వడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. సాంకేతికంగా క్లిష్టమైనది కూడా. విజయావకాశాలు అనిశ్చితంగా ఉంటాయి. పర్యావరణ అనుమతులు, భూసేకరణ, మత్స్యకారులతో సమన్వయం, సముద్ర జలాలపై సార్వభౌమాధికార అంశాలు, పెట్టుబడుల కొరత—ఇవన్నీ అన్వేషణ, వెలికితీత ప్రక్రియలను ఆలస్యం చేయడమే కాకుండా అనిశ్చితికి గురిచేస్తాయి. ఈ సవాళ్లను అధిగమించడానికి పర్యావరణ, భూసేకరణ మరియు స్థానిక అనుమతులను ఏకీకృత ‘సింగిల్‌ విండో’ వ్యవస్థ ద్వారా వేగంగా మంజూరు చేయడం అత్యవసరం. అంతేకాకుండా, మిషన్‌ సముద్ర మంథన్‌, మిషన్‌ అన్వేషణ వంటి కార్యక్రమాలను సమన్వయం చేసి ఒకే మిషన్‌గా అమలు చేయాలి. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో కూడిన సమగ్ర ‘నేషనల్‌ ఎనర్జీ సెక్యూరిటీ మిషన్‌’ను రూపొందించడం అవసరం.

ఇదే సమయంలో ప్రపంచం పునరుత్పాదక ఇంధన వనరుల వైపు వేగంగా దూసుకెళ్తోంది. సౌర, వాయు శక్తి, హైడ్రోజన్‌ వంటి ప్రత్యామ్నాయాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే భారత్‌ సుమారు 180 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించింది. అయినప్పటికీ, శక్తి మార్పు ఒక క్రమబద్ధమైన, దీర్ఘకాలిక ప్రక్రియ. వచ్చే కొన్ని దశాబ్దాల పాటు శిలాజ ఇంధనాల ప్రాముఖ్యత కొనసాగడం అనివార్యం. అందుకే భారత్‌ ఒక ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది—ఒక వైపు పునరుత్పాదక వనరులను వేగంగా అభివృద్ధి చేస్తూనే, మరోవైపు సంప్రదాయ ఇంధన వనరుల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తోంది.

మొత్తానికి, భారత్‌ ఇంధన రంగంలో చేపడుతున్న చర్యలు కేవలం ఉత్పత్తి పెంపు గురించే కాదు; అవి దేశ ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్‌ అభివృద్ధికి పునాది వేస్తున్న వ్యూహాత్మక మార్పులు.

– బాలాజీ పల్లపోతుల
9949098406

Leave a Reply