డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి
- ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వరంగల్‌లో 2కే రన్ నిర్వహణ
హన్మకొండ, ఆంధ్రప్రభ : డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్‌ను శుక్రవారం పోలీస్ కమిషనర్, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ట్రైసిటీ పరిధికి చెందిన యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విజేతలకు ముఖ్య అతిథులు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం ప్రస్తుతం సమాజానికి పెద్ద సవాల్‌గా మారిందన్నారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఒక్కసారి వాటికి అలవాటు పడితే జీవితాలు అంధకారమవుతాయని హెచ్చరించారు. మత్తు పదార్థాల విక్రయం, వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండి, విద్యార్థులు చదువుపై, యువత తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని సూచించారు.
పశ్చిమ వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని కోరారు. మాదకద్రవ్యాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడంతో పాటు ఇతరులకు కూడా చైతన్యం కల్పించాలని అన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగల్ ఫోర్స్ ప్రత్యేకంగా పనిచేస్తోందని, ఎవరైనా మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలిసిన వెంటనే 1908 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌కు బానిసైన వారి కుటుంబాలు, ముఖ్యంగా తల్లులు అనుభవించే వేదన వర్ణనాతీతమని అన్నారు.
అనంతరం యువత, విద్యార్థులతో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం సైనికుల్లా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అలాగే కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు “ఐయాం యాంటీ డ్రగ్స్ సోల్జర” సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటోలు దిగుతూ యువతకు స్ఫూర్తినిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కె.ఆర్. నాగరాజు, టీజీఎన్‌పీడీసీఎల్ ఎండీ వరుణ్‌రెడ్డి, వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టర్లు డా. సత్యశారద, చాహత్ బాజ్‌పాయి, కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, డీసీపీలు దారా కవిత, అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్య, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
