10thMayeditorial | పోరాటం నుంచి సీఎం పీఠం వరకు సువేందు ప్రయాణం
10thMayeditorial | పోరాటం నుంచి సీఎం పీఠం వరకు సువేందు ప్రయాణం
10thMayeditorial | కమ్యూనిస్టుల కంచుకోటలో బీజేపీ చారిత్రక విజయం
మమత పాలన నుంచి బెంగాల్‌కు కొత్త దిశ
శాంతి, అభివృద్ధే లక్ష్యమన్న కొత్త ప్రభుత్వం
భయ వాతావరణం నుంచి విముక్తి కల్పిస్తామన్న మోదీ
10thMayeditorial | బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేయడంతో కొత్త శకం ప్రారంభమైంది. కమ్యూనిస్టుల కంచుకోటగా దశాబ్దాలపాటు ఉన్న బెంగాల్ ఇప్పుడు బీజేపీ పట్టుగొమ్మ కావడం ఐదు దశాబ్దాల రాజకీయాల్లో వచ్చిన చెప్పుకోదగిన మార్పు. స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి జాతీయవాదానికి పుట్టినిల్లు అయిన బెంగాల్ దశాబ్దాల పాటు కమ్యూనిస్టులకు కంచుకోట కావడం ఆశ్చర్యంగా చెప్పుకునేవారు ఆ రోజుల్లో.
బెంగాలీలు విద్యావంతులు. పరిశోధనా రంగంలో మేటి అయిన జగదీష్ చంద్రబోస్, సాహిత్యంలో మణిమకుటమైన విశ్వకవి రబీంద్రనాథ్ టాగోర్, బ్రిటిష్ వారిని గడగడలాడించిన సుభాస్ చంద్రబోస్ వంటి హేమాహేమీలు బెంగాల్‌కు చెందిన వారే. స్వాతంత్ర్యోద్యమంలో కూడా ఖుదీరామ్ బోస్, చిత్తరంజన్ దాస్ వంటి జాతీయ నాయకులంతా అక్కడి వారే. వామపక్ష తీవ్రవాదం పుట్టింది కూడా అక్కడే.
బెంగాల్ స్వతహాగా సాధు స్వభావులు, శాంతిప్రియులు. భారతదేశానికి ఎంతో మంది శాస్త్రజ్ఞులనూ, పరిశోధనావేత్తలనూ అందించిన రాష్ట్రం. రాజకీయంగా కూడా బెంగాల్ అతిరథ మహారథులకు పేరెన్నికగన్నది. యూపీఏ హయాంలో ప్రధానమంత్రి పదవికి మార్క్సిస్టు పార్టీ దిగ్గజం జ్యోతిబసు పేరు ప్రతిపాదనకు వచ్చింది. ఆయన తిరస్కరించడం చారిత్రక తప్పిదం అని ఇప్పటికీ అంటుంటారు.
బెంగాల్లో ఎంతో మంది నోబెల్ బహుమతి గ్రహీతలు ఉన్నారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ బెంగాల్‌కు చెందిన వారే. బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సువేందు అధికారి కూడా ఉన్నత విద్యావంతుడే. ఆయన తండ్రి శిశిర్ అధికారి ఎంపీగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించారు.
సువేందు అధికారి మొదట కాంగ్రెస్‌లో ప్రవేశంతోనే రాజకీయ అరంగేట్రం చేశారు. నిబద్ధతకు, నిజాయితీకి మారుపేరుగా ఎదిగిన సువేందు తృణమూల్‌లో చేరి మమతా బెనర్జీకి కుడి భుజంగా వ్యవహరించారు. బెంగాల్ చరిత్రలో స్థిరంగా నిలిచిపోయిన నందిగ్రామ్ రైతాంగ పోరాటం ద్వారా మంచి పేరు సంపాదించారు. బెంగాల్లో శాంతిభద్రతల పునరుద్ధరణ తన ప్రధమ కర్తవ్యమన్న ఆయన మాటల్లో నిజం ఉంది. తరచూ అలజడులు, హింసాత్మక కార్యకలాపాలు వల్ల పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. వాటిని తిరిగి రప్పించడం ఆయన అజెండాలో మొదటిది.
