Zelenskyy | నాలుగేళ్ల యుద్ధానికి తెర దించుదాం..

Zelenskyy | నాలుగేళ్ల యుద్ధానికి తెర దించుదాం..

ముఖాముఖి చ‌ర్చ‌ల‌తో శాంతిని సాధిద్దాం
స్విట్జర్లాండ్ లేదా టర్కీ వేదిక‌గా చ‌ర్చ‌లు జ‌రుపుదాం
ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌కు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ ఆహ్వానం
జెలెన్‌స్కీతో భేటీ ప్రతిపాదనను తిరస్కరించిన పుతిన్
ప్రస్తుతానికి చర్చలకు ఎలాంటి అర్థం లేదని వ్యాఖ్య
రష్యా సైనిక చర్యలను ఆపడమే ఉక్రెయిన్ లక్ష్యమన్న పుతిన్
జెలెన్‌స్కీ లేఖలో దురుసు అంశాలున్నాయని ఆరోపణ

Zelenskyy | సెంట్ర‌ల్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతిపాదించిన ముఖాముఖి చర్చలను రష్యా అధ్యక్షుడు పుతిన్ తిరస్కరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి భేటీకి ఎలాంటి అర్థం లేదని స్పష్టం చేశారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక ఫోరమ్‌లో ప్రసంగిస్తూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంత‌కు ముందు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బహిరంగ లేఖ రాశారు.

Zelenskyy |
Zelenskyy |

యుద్ధాన్ని ఆపేద్దాం.. దీనికోసం ముఖాముఖి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. అయితే అదే సమయంలో యుద్ధానికి పూర్తి బాధ్యత పుతిన్‌దేనని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ జెలెన్‌స్కీ రాసిన ఈ ఓపెన్ లెటర్‌ అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

నాటో, భౌగోళిక రాజకీయాలు, రష్యన్‌ భాష వంటి అంశాలను కారణాలుగా చూపుతున్నప్పటికీ, అసలు ఈ యుద్ధం పుతిన్‌ వ్యక్తిగత నిర్ణయమేనని జెలెన్ స్కీ ఆ లేఖ‌లో పేర్కొన్నారు. 26 ఏళ్లలో పుతిన్‌ పాలనలో రష్యా-ఉక్రెయిన్‌ సంబంధాలు పూర్తిగా మారిపోయాయని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు వాణిజ్యం, పౌర సహకారం గురించి మాట్లాడుకునే దేశాలు ఇప్పుడు క్షిపణి దాడులు, మరణాలు, విధ్వంసం గురించే చర్చించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రష్యాలో యుద్ధ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోందన్నారు. పెరుగుతున్న ధరలు, ఇంధన కొరత, ఆంక్షలు, నిరంతర సైనిక నియామకాలతో సాధారణ రష్యన్లు అసంతృప్తికి గురవుతున్నారని పేర్కొన్నారు.

యుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యా రాజకీయ, ఆర్థిక వనరులు క్రమంగా బలహీనపడుతున్నాయని వ్యాఖ్యానించారు. యుద్ధభూమిలో రష్యా భారీ నష్టాలు చవిచూస్తోందని పేర్కొన్నారు. మే నెలలోనే 30 వేల మందికిపైగా రష్యన్‌ సైనికులు మరణించారని, అంత‌కంటే ఎక్కువ మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ముఖ్యంగా డోనెట్స్క్‌ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలన్న రష్యా లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదని, ఈ ఏడాది కూడా అది సాధ్యం కాదని లేఖ‌లో ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, ఉక్రెయిన్‌ త్వరగా కుప్పకూలిపోతుందని భావించిన రష్యా అంచనాలు తప్పాయని పేర్కొన్నారు.

Zelenskyy | పుతిన్ కౌంట‌ర్

శాంతి చర్చల నిమిత్తం స్విట్జర్లాండ్ లేదా టర్కీ వంటి తటస్థ దేశాల్లో సమావేశమవుదామని, అంతర్జాతీయ పర్యవేక్షణలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని జెలెన్‌స్కీ బహిరంగ లేఖ ద్వారా పుతిన్‌ను కోరారు. ఈ ప్రతిపాదనపై పుతిన్ స్పందిస్తూ.. “ప్రస్తుత తరుణంలో ఇటువంటి సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మా సైనిక చర్యలను అడ్డుకోవడమే ఉక్రెయిన్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది” అని పేర్కొన్నారు. ఇరువురు నేతలు భేటీ కావడానికి ముందే నిపుణులు సమస్యల పరిష్కార మార్గాలను అన్వేషించాలని అభిప్రాయపడ్డారు.

జెలెన్‌స్కీ రాసిన లేఖను తాను పరిశీలించానని, అందులో కొన్ని “అభ్యంతరకర అంశాలు” ఉన్నాయని పుతిన్ ఆరోపించారు. ఈ సమావేశాన్ని సఫలం చేయడం కంటే, విఫలం చేయాలనే ఉద్దేశంతోనే ఈ లేఖ రాసినట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రష్యా నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరే వరకు సైనిక చర్యలు కొనసాగుతాయని పుతిన్ పునరుద్ఘాటించారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో, జెలెన్‌స్కీ అధ్యక్ష పదవి చట్టబద్ధతపై క్రెమ్లిన్ గతంలోనూ పలు ప్రశ్నలు లేవనెత్తిన విషయం విదితమే.

CLICK HERE TO READ MORE : Goddali Party | ప్రజాసేవే కార్యకర్తల లక్ష్యం కావాలి

CLICK HERE TO READ MORE :

Leave a Reply