Counting Countdown |సస్పెన్స్ .. టెన్షన్ ! పెద్దల పీఠం దక్కేదెవరికో

తెలంగాణ. ఏపీలోని పెద్దల సభలో అడుగుపెట్టే పట్టభద్రులు, అయ్యవార్ల భవిష్యత్తును లెక్కకట్టే ప్రక్రియ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఆరు ఎమ్మెల్సీల్లో రసవత్తర పోరు ముగిసింది. ఒక వైపు టీచర్లు.. మరో వైపు గ్రాడ్యుయేట్లు బారులు తీరి.. అభ్యర్థుల జాతకాలను తెలిపే నిర్ఱయాన్ని బ్యాలెట్ బాక్సుకు సమర్పించారు. ఏతావాతా నోట్ల పంపిణీ, చిన్న చిన్న గొడవలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో రెండు గ్రాడ్యుయేట్లు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానంలోనూ… తెలంగాణలో రెండు టీచర్లు , ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో హోరాహోరీ పోరు జరిగింది. ఇక్కడ చిత్రమేమిటంటే.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీలు పోటీ చేయలేదు. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ అభ్యర్థులు పోటీలో లేరు. ఈ స్థితిలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి పడ్డాయో అంతు చిక్కటం లేదు. కాంగ్రెస్ను వ్యతిరేకించే బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందా? లేదా? అనేది ఈ ఎన్నికల ఫలితాలు తేలుస్తాయి. ఇక ఏపీలో వైసీపీ తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. కూటమికి ప్రత్యర్థులు వామపక్ష అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. కానీ టీచర్లు ఎప్పుడూ అధికార పార్టీకే మద్దతు ఇస్తారు? ఈ స్థితిలో ఏపీ, తెలంగాణలోని టీచర్ల స్థానాల్లో అధికార పార్టీకే విజయవకాశాలు కనిపిస్తాయి. ఇక గ్రాడ్యుయేట్స్ కూడా ఇప్పటికే అధికార పార్టీకే మద్దతు పలుకుతారు. ఈ స్థితిలో ఏపీ, తెలంగాణలోని అధికార పార్టీకే పెద్దల సభలో సీట్లు దక్కుతాయని రాజకీయ పరిశీలకుల అంచనా.

ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్ తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో పెద్దల ఎన్నికల ఫలితాలు గుబులు రేపుతున్నాయి. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులో పట్టభద్రులు ఏమి గుర్తించారు. సీఎంల పని తీరుపై ఏం ఆలోచిస్తున్నారు? హామీలు నెరవేర్చక పోతే కాంగ్రెస్కు ఓటు వేయొద్దని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్టభద్రులకు సూచించగా.. సూపర్ సిక్సుల అమలులో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వానికే పట్టం కట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఈ రెండు చోట్ల అధికార పార్టీ పనితీరుపై పట్టభద్రుల్లో ఎలాంటి స్థితి నెలకొందో.. ఈ ఫలితాలు నిర్ణయిస్తాయి.

జనం ఏం ఆలోచిస్తున్నారో.. ఈ ఫలితాలు మర్మగర్భంగా చెబుతాయి. అధికార పార్టీ గెలిచినా.. అందులో వచ్చిన ఓటు శాతం అసలు నిజాన్ని వెల్లడి చేస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

కృష్ణా గోదారి జిల్లాల్లో .. ఉత్కంఠప్రధాన ఎన్నికల అధికారి సమాచారం ప్రకారం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి పట్టభద్రుల నియోజకవర్గాల్లో 63.28 శాతం, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాల్లో 65.58 శాతం, శ్రీకాకుళం –విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 91.82 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ, పీడీఎఫ్‌ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కానీ పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు, ఎన్డీఏ మద్దతుతో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ, యూటీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి మధ్య పోరు నెలకొంది. ఈ త్రిముఖ పోటీలో గెలుపు ఎవరిదో.. సస్పెన్స్ నెలకొంది. కృష్ణాగుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో ఎన్డీయే అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు మధ్యే పోటీ కనిపిస్తోంది. ఈ స్థానంలో 25 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ఇద్దరి మధ్యేగట్టి పోటీ తప్పలేదు. ఈ నియోజకవర్గంలో వైసీపీ కేడర్ లక్ష్మణరావుకే తమ మద్దతు ప్రకటించారు. ఇక గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలోనూ ఎన్నికల రసవత్తరంగా జరిగింది. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానంలో మొత్తం 35 మంది బరిలో ఉన్నారు. వీరిలో టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌, పీడీఎఫ్‌ అభ్యర్థి డీవీ రాఘవులు, స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ పోటీపడ్డారు.

తెలంగాణలో గ్రాడ్యుయేట్లపైనే అందరి దృష్టి

తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ మూడు స్థానాల్లోనూ పోటీ చేసిన బీజేపీ తన బలాన్ని ప్రదర్శించబోతోంది. ఇక రాష్ట్రంలో ఒక స్థానంలోనే పోటీచేసిన అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక్కడ ఓడిపోతే ఎన్నికలకు రిఫరెండంగా భావించాలని బీజేపీ సవాల్ విసిరింది. ఈ స్థితిలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పాలనను పట్టభద్రులు వ్యతిరేకించారా? మరో చాన్స్ ఇచ్చారో తేలాల్సి ఉంది. ఇక రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార పార్టీకే టీచర్లు మద్దతు పలుకుతారని ఒక అంచనా. ఈ సందర్భంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అందరి దృష్టి ఆకర్షిస్తోంది. మొత్తం 56 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ సహా ఇండిపెండెంట్ అభ్యర్థి మధ్య తీవ్రపోటీ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. మూడో ప్రాధాన్యత ఓటుతోనే గెలిచే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకుల అంచనా. 56 మంది అభ్యర్థులు ఉన్నా.. నాలుగు, మూడు స్థానాల్లో నిలిచే అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియతోనే విజేత తేలే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పోటీచేశారు. ఈ ఇద్దరి విజయంపై ధీమాగా ఉన్నారు. పార్టీ కేడర్‌తో పాటు ఆర్థికంగా బలవంతులు కావడంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం తమకు కలిసొస్తుందని బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉండటం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తున్నాయి.

బీఎస్పీ మద్దతుతో పోటీలో ఉన్న ప్రసన్న హరికృష్ణ సైతం పట్టభద్రులు తనను గెలిపిస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ముగిసినప్పటికీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపారనేది ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల టీచర్ల ఎమ్మెల్సీ స్థానంలో , వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ల స్థానాల్లో రాజకీయ పార్టీలు పోటీ చేయలేదు. దీంతో పట్టభద్రుల స్థానంపైనే ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *