హైదరాబాద్, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్ స్టేషన్‌కు రూ.720 కోట్లతో ఆధునికీకరరణ చేస్తున్ననేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణీకులు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ స్టేషన్‌కు రూ.720 కోట్లతో అమృత్‌భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ సమయంలో సికింద్రాబాద్ స్టేషన్ రాకపోకల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిర్మాణ పనుల్లో భాగంగా ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందు లను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే పలు సూచనలు జారీ చేసింది. ఉత్తరం వైపు ఉన్న స్టేషన్ భవనం కూల్చివేత, కొత్త నిర్మాణం నేపథ్యంలో ప్రవేశ, ఎగ్జిట్ మార్గాలను ప్రకటించింది. ఇందులో భాగంగా ప్లాట్‌ఫామ్ నంబర్ 1పై గణేష్ ఆలయం పక్కన వద్ద కొత్త ప్రవేశద్వారం ఏర్పాటు చేశారు. టికెట్, విచారణ కౌంటర్లతో పాటు 750 మంది ప్రయాణికులకు సరిపోయేలా కొత్త వెయిటింగ్ హాల్ సౌకర్యం కల్పించారు. గేట్ నంబర్ 4 మూసివేసినందున స్వాతి హోటల్ ఎదురుగా వద్ద అదనపు ప్రవేశద్వారం ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్లాట్‌ఫామ్ నంబర్ 10లో గేట్ నంబర్ 8 (బోయిగూడ వైపు) వద్ద టికెట్ కౌంటర్‌తో పాటు మరో కొత్త ప్రవేశ ద్వారం ఏర్పాటు చేశారు. స్టేషన్‌లో ఎంట్రీ / ఎగ్జిట్ మార్గాలు, ప్లాట్ ఫారాలను గుర్తించడానికి, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలపై సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు.
రైళ్లు వచ్చే ఫ్లాట్ ఫారాల వివరాలను ముందుగానే ప్లాట్‌ఫారమ్ 1, 10లో ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి అదనపు సిబ్బందిని నియమించారు. ఆధునికీకరణ కోసం పనులు జరుగుతున్న నేపథ్యంలో పురాతన కట్టడాలను అధికారులు కూల్చి వేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచే భవన నిర్మాణాన్ని కూల్చివేసి నూతన భవనాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మించనున్నారు.